ఆ నాలుగు కులాల వారికి ఏపీ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Sep 2020 9:45 AM GMT
ఆ నాలుగు కులాల వారికి ఏపీ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ‘వైఎస్సార్ చేయూత’ పధకంలో మరో నాలుగు కులాలను కూడా చేర్చారు. బుడగ జంగం, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతొ ఒరియా కులాల వారికి కులధ్రువీకరణ పత్రం అవసరం లేకుండానే వైఎస్సార్‌ చేయూత పథకం వర్తింపు జేయాలని జ‌గ‌న్ స‌ర్కార్‌ నిర్ణయించింది. ఈ నాలుగు కులాల వారు వివిధ కారణాలతో కులధ్రువీకరణ పత్రం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కులధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల ఆయా కులాల్లో పలువురు అర్హత ఉండి కూడా పథకం కింద లబ్ధి పొందలేకపోయారని పలువురు మంత్రులు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎం కార్యాలయ ఆదేశాల మేరకు స్వయం కులధ్రువీకరణ పత్రంతోనే అర్హులకు వైఎస్సార్‌ చేయూత పథకాన్ని అందించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాల్లో 45–60 ఏళ్ల మధ్య ఉండే మహిళలకు నాలుగు విడతల్లో రూ.75 వేలు చెల్లించే వైఎస్సార్‌ చేయూత పథకాన్ని గత నెల 12న ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకానికి ఈ నాలుగు కులాల వారిలో అర్హులను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టినట్టు సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు.

Next Story
Share it