బ్యాటింగ్ విషయంలో సలహా ఇచ్చినందుకు మెడ మీద కత్తి పెట్టాడు
By తోట వంశీ కుమార్ Published on 3 July 2020 11:57 AM ISTపాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ తన మెడపై యూనిస్ ఖాన్ కత్తి పెట్టాడని ఆరోపించాడు. ఆస్ట్రేలియా టూర్ కు పాకిస్థాన్ జట్టు వెళ్ళినప్పుడు యూనిస్ ఖాన్ టెక్నిక్ విషయంలో కొన్ని మార్పులు సూచించగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ తన మెడ మీద కత్తి పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.
మీ కెరీర్ లో మీరు చూసిన వైవిధ్యమైన వ్యక్తుల గురించి చెప్పమని గ్రాంట్ ఫ్లవర్ ను కోరగా.. అతడు యూనిస్ ఖాన్ గురించి చెప్పుకొచ్చాడు. 49 సంవత్సరాల జింబాబ్వే మాజీ క్రికెటర్ గ్రాంట్ ఫ్లవర్ 2014- 2019 వరకూ పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా సేవలు అందించాడు.
ఇటీవల ఓ పోడ్ కాస్ట్ లో మాట్లాడిన గ్రాంట్ ఫ్లవర్.. యూనిస్ ఖాన్ క్యారెక్టర్ తనకు అంతుపట్టలేదని. అతడిని మార్చడం చాలా కష్టమైందని చెప్పుకొచ్చాడు. బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్ సమయంలో బ్రేక్ ఫాస్ట్ సమయంలో తాను యూనిస్ ఖాన్ కు బ్యాటింగ్ విషయంలో సలహాను ఇవ్వడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్న కత్తిని తన మెడ మీద పెట్టాడని చెప్పుకొచ్చాడు. అక్కడే ఉన్న మిక్కీ ఆర్థర్ అడ్డు వచ్చాడని గ్రాంట్ ఫ్లవర్ తెలిపాడు. కోచ్ గా ఎన్నో ఘటనలు జరిగాయని, ఎన్నో వైవిధ్యభరిత క్యారెక్టర్లను చూశానని.. తన కోచింగ్ జర్నీని ఎంతగానో ఎంజాయ్ చేశానని అన్నాడు.
ఇంగ్లాండ్ టూర్ కు పాకిస్థాన్ త్వరలోనే వెళ్లనుంది. పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా యూనిస్ ఖాన్ ను అపాయింట్ చేశారు. యూనిస్ 118 టెస్టుల్లో 10,099 పరుగులు చేశాడు. యూనిస్ ఖాన్ గ్రాంట్ ఫ్లవర్ చేసిన వ్యాఖ్యలకు ఇంకా స్పందించలేదు.
2016లో పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా టూర్ లో ఈ ఘటన చోటుచేసుకుందని భావిస్తూ ఉన్నారు. బ్రిస్బేన్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో యూనిస్ ఖాన్ డకౌట్ గా వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 65 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టులో 175 పరుగులతో యూనిస్ ఖాన్ నాటౌట్ గా నిలిచినప్పటికీ పాకిస్థాన్ 3-0 తో టెస్ట్ సిరీస్ ను ఓడిపోయింది.
పాక్ క్రికెటర్ షెహజాద్ అహ్మద్ ది కూడా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని చెప్పుకొచ్చాడు. మంచి ట్యాలెంట్ ఉన్న ఆటగాడే అయినప్పటికీ.. రెబల్ లక్షణాలు ఉన్న వ్యక్తి అని చెప్పుకొచ్చాడు.