కాంగ్రెస్‌ను వీడుతున్న ఆశా కిరణాలు

By Medi Samrat  Published on  14 July 2020 8:39 AM GMT
కాంగ్రెస్‌ను వీడుతున్న ఆశా కిరణాలు

ప్రస్తుతం రాజస్థాన్ రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లో నాయకత్వ లేమితోపాటు...సీనియర్లు, జూనియర్ల మధ్య సమన్వయ లోపాలు పలుమార్లు తేటతెల్లమయ్యాయి. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా వ్యవహారంతో ఈ విభేదాలు బయటి ప్రపంచానికి బహిర్గతమయ్యాయి. అదే తరహాలో తాజాగా రాజస్థాన్ లోనూ సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు, సచిన్ పైలట్ కు ఉన్న విభేదాలు బయటపడ్డాయి.

Sp

సచిన్ పైలట్ బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరిగినా.. అందుకు అవకాశం లేదని సచిన్ స్పష్టం చేశారు. ఇక, సచిన్ పై చర్యలు తీసుకోవాలంటూ పరోక్షంగా సీఎల్పీ సమావేశంలో నిర్ణయించారు అయితే, అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటూ సచిన్ మద్దతుదారులు అంటున్నారు. సచిన్ పైలట్ ను బుజ్జగించేందుకు రాహుల్, ప్రియాంకా గాంధీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ లోని పలువురు సీనియర్ నేతలను విస్మయపరుస్తున్నాయి. సింధియా వంటి కీలక నేతలు పార్టీ వీడే వరకు అధిష్టానం మిన్నకుండడంపై కపిల్ సిబల్ వంటి నేతలే పెదవి విరుస్తున్నారు. సచిన్ పైలట్ వంటి యువనేతలు తిరుగు బాటు బావుటా ఎగురవేసేవరకు అధిష్టానం మౌనం వెనుక కారణమేమిటని ప్రశ్నిస్తున్నారు.

Msp

ఓ వైపు యువకులను పార్టీలో చేర్చుకొని కొత్త రక్తం ఎక్కించుకోవాల్సిన దశలో ఉన్న కాంగ్రెస్.. ఆల్రెడీ పార్టీలో కీలకంగా మారిన యువనేతలను కోల్పోవడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నాడు సింధియా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి కీలక నేతగా ఎదుగుతున్నారు. నేడు సచిన్ పైలట్.. సొంతపార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. సచిన్ బీజేపీలో ఇంకా చేరలేదు. కానీ, దాదాపుగా చేరతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, తాను బీజేపీలో చేరబోనంటూ సచిన్ పైలట్ స్వయంగా ప్రకటన చేశారు.

సింధియా తరహాలోనే కాంగ్రెస్ ను వీడి వేరే పార్టీలో చేరి కీలక నేతలుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. సచిన్ లాగా కాంగ్రెస్ విధివిధానాలను ప్రశ్నించిన వారు.. అలా ప్రశ్నించినందుకు పార్టీలో ప్రాముఖ్యత తగ్గించుకున్న వారు మరెందరో ఉన్నారు. పార్టీలో ప్రాధాన్యత తగ్గినప్పటికీ.. బీజేపీలోనో మరే ఇతర పార్టీలోనో చేరడం ఇష్టం లేక.. అలాగా కాంగ్రెస్ లో సుప్త చేతనావస్థలో కొనసాగుతున్న నేతలూ కొందరున్నారు.

ఇలా కాంగ్రెస్ కోల్పోయిన సింధియా, మహువా మొయిత్రా వంటి ఆశా కిరణాలు వేరే పార్టీలో వెలిగిపోవడం.. కేవలం కాంగ్రెస్ అధిష్టానం ఉదాసీన వైఖరికి నిదర్శనమని చెప్పవచ్చు. అలా కాంగ్రెస్ ను వీడిన కీలక నేతలెందరో నేడు క్రియాశీలక రాజకీయాల్లో కీలక నేతలుగా వెలుగొందుతున్నారు. మరికొందరు పార్టీని వీడలేక కొనసాగుతున్నారు.

Ms

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో యువనేతగా జ్యోతిరాదిత్య సింధియా ఎదిగారు. రాహుల్ కు అత్యంత సన్నిహితుడైన సింధియా.. 2019ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. సీనియర్ అయిన కమల్ నాథ్ కు సీఎం పదవి దక్కడంతో సింధియా.. బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయిన సింధియా.. మధ్యప్రదేశ్ బీజేపీలో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు.

రాజస్థాన్ రాజకీయాల్లో సచిన్ పైలట్ తనదైన ముద్ర వేసుకున్నారు. 2019 ఎన్నికల్లో రాజస్థాన్ లో కాంగ్రెస్ గెలుపులో సచిన్ పాత్ర ఎంతో ఉంది. అయితే, అశోక్ గెహ్లాట్ కు సీఎం పదవి దక్కడంతో సచిన్ డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్నారు. సీనియర్, జూనియర్ ల గేమ్ లో సచిన్.. తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బీజేపీలో చేరబోనంటూ స్పష్టం చేసిన సచిన్.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే రెబల్ గా కొనసాగుతున్నారు.

Mm

మహువా మొయిత్రా.. రాజకీయాల గురించి తెలిసిన వారికి ఈ పేరు సుపరిచితమే. లోక్ సభలో బీజేపీ సర్కార్ ను ఉతికి ఆరేసిన ఈ మహిళ పేరు మీడియాలో మార్మోగిపోయింది. కాంగ్రెస్ లోని యువ నేతల్లో ఒకరైన మహువా మొయిత్రా.. రాహుల్ టీంలో కీలక నేతగా ఎదిగారు. 2010లో పార్టీ వీడిన మహువా. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ తరఫున కరింపుర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో క్రిష్ణానగర్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు.

రాయ్ బరేలీలో కాంగ్రెస్ సీనియర్ నేత నదీమ్ అష్రాఫ్ జైసీ కూడా కాంగ్రెస్ ను వీడి ఆప్ లో చేరారు. రాహుల్, ప్రియాంకాలకు సన్నిహితుడైన జైసీ.. పార్టీని వీడడంతో రాయ్ బరేలీలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోనియా ప్రాతినిధ్యం వహిస్తోన్న రాయ్ బరేలీలో జైసీ పార్టీని వీడడంతో అక్కడి యువతను కాంగ్రెస్ వైపు తిప్పే బలమైన నాయకుడు లేకుండా పోయాడని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఉత్తర ప్రదేశ్ కి ఒక్క రోజు సీఎంగా పనిచేసిన జగదాంబికా పాల్ కూడా కాంగ్రెస్ ను వీడిన కీలక నేతల్లో ఒకరు. 2014లో కాంగ్రెస్ వీడి బీజేపీ తరఫున దోమరియాగంజ్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2019లోనూ తన స్థానాన్ని పదిలంగా ఉంచుకొని ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు. పాత, కొత్త తరానికి మధ్య గ్యాప్ రావడంతో కాంగ్రెస్ ను వీడారు.

Ys

ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ కూడా 2009లో కాంగ్రెస్ ను వీడారు. సీఎం పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వైఖరి నచ్చక సొంతపార్టీ పెట్టి.. నేడు అఖండ మెజారిటీతో ఏపీ సీఎం అయ్యారు. టీడీపీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరామారావు కుమార్తె పురంధరేశ్వరి కూడా కాంగ్రెస్ నువీడిన కీలక నేతల్లో ఒక‌రు. మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధరేశ్వరి కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరిగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలన్న కాంగ్రెస్ నిర్ణయంతో విభేదించి.. పార్టీని వీడారు. ఇపుడు, బీజేపీలో కొనసాగుతున్నారు.

ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న సత్పాల్ మహరాజ్ కు ప్రజాదరణ ఎక్కువ. పౌరీ లోక్ సభ నుంచి ప్రాతినిధ్యం వహించిన సత్పాల్ కాంగ్రెస్ తో విభేదించారు. హరీష్ రావత్ కు సీఎం పదవి ఇచ్చేందుకు తనను పక్కకుపెట్టడంతో బీజేపీలో చేరారు. గుజరాత్ కు చెందిన మరో కీలక నేత జసా బరాద్ కూడా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి కీలక స్థానంలో ఉన్నారు. గుజరాత్ లోని హిమ్మత్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న రాజేంద్రసింగ్ చావ్డా కూడా కాంగ్రెస్ లో కీలక నేతగా ఉండి బీజేపీలో చేరారు.

Md

ఇక, కాంగ్రెస్ ను వీడలేక పార్టీలోనే కొనసాగుతూ.. ఉన్న కీలక నేతలు మరికొందరున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు మాజీ ఎంపీ మిలింద్ దేవరా. 2019లో పార్టీ ఓటమి తర్వాత తనకు అప్పగించిన ముంబై కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు మిలింద్. ఆర్టికల్ 370 విషయంలో కాంగ్రెస్ విధివిధానాలు నచ్చక....పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా కూడా.. క్రియాశీలకంగా ఉండడం లేదు. మిలింద్ ను సీనియర్లు పక్కనబెట్టారని ప్రచారం జరుగుతోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసేందుకే మిలింద్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ వర్గాలకు కీలక నేతగా ఉన్న మాజీ కేంద్రమంత్రి జితిన్ ప్రసాద కూడా దాదాపుగా మిలింద్ తరహాలోనే పార్టీని ఆర్టికల్ 370 విషయంలో ప్రశ్నించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్నప్పటికీ.. ప్రసాద సైలెంట్ అయిపోయారు. హరియాణా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా తనయుడు మూడు సార్లు ఎంపీగా గెలిచిన దీపేందర్ హుడా కూడా కాంగ్రెస్ లో సుప్తచేతనావస్థలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు నామినేట్ అయిన హుడా.. ఆర్టికల్ 370 విషయంలో మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన హుడా.. అప్పటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ.. పార్టీ పెద్దలు హుడాను పక్కనపెట్టారు. ఢిల్లీ మాజీ సీఎం, దివంతగ నేత షీలా దీక్షిత్ తనయుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ కూడా కాంగ్రెస్ లో కొనసాగుతున్నప్పటికీ.. ఎటువంటి ప్రాధాన్యత దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారు.

Sr

ఇకనైనా కాంగ్రెస్ మేలుకోకుంటే.. సింధియా తరహాలో కాంగ్రెస్ లో అసంతృప్తితో కొనసాగుతున్న మరింతమంది యువనేతలు పార్టీని వీడే అవకాశముందని.. సచిన్ తరహాలో తిరుగుబాటు బావుటా ఎగురవేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story