ఐపీఎల్‌లో రైనా ఆడే అవకాశం.. ధోని, శ్రీనివాసన్ గురించి ఏం అన్నాడంటే..?
By తోట వంశీ కుమార్ Published on 2 Sep 2020 10:33 AM GMTఆగష్టు 15న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పాటూ, సురేష్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సురేష్ రైనా తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు చెబుతున్న సమయంలోనే సురేష్ రైనా రిటైర్మెంట్ ప్రకటించడం సంచలనం అయింది. ఇక సురేష్ రైనాను, మహేంద్ర సింగ్ ధోనిని ఐపీఎల్ లో చూసుకునే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఐపీఎల్ నుండి సురేష్ రైనా తప్పుకున్నట్లు 'చెన్నై సూపర్ కింగ్స్' యాజమాన్యం తెలిపింది.
కరోనా భయం.. కుటుంబంపై బెంగ, సన్నిహితుల మరణం… ఫ్రాంచైజీతో విభేదాలు.. రైనా నిష్క్రమణకు కారణాలంటూ ప్రచారం జరిగింది. భారత్ కు తిరిగి రావాల్సి వచ్చిందో గల కారణాలను రైనా వివరించే ప్రయత్నం చేశాడు. పంజాబ్‌లో తన మేనత్త కుటుంబంపై జరిగిన దాడి దారుణమని, తన మామాను దుండగులు అతి కిరాతకంగా చంపారని రైనా ఆవేదన వ్యక్తం చేశాడు. ‘పంజాబ్‌లో మా బంధవులపై జరిగింది చాలా దారుణం. మా మామను అత్యంత దారుణంగా హత్య చేశారు. దుండగుల దాడిలో మా అత్త, ఇద్దరు కజీన్స్ తీవ్రంగా గాయపడ్డారు. దురదృష్టవశాత్తు చికిత్సపొందుతూ మా కజిన్ గత రాత్రి ప్రాణాలు విడిచారు. మా అత్తమ్మ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. మృత్యువుతో పోరాడుతుంది. ఈ రోజుకి ఆరాత్రి ఏం జరిగిందనేదానిపై స్పష్టత లేదు. ఎవరు చేశారనేది తెలియడం లేదు. పంజాబ్ పోలీసులను నేను కోరేది ఒక్కటే.. దుండగులను వదిలిపెట్టవద్దు. వారిని పట్టుకునే మార్గాలున్నాయి. ఇలాంటి దారుణాలు మళ్లీ చేయకుండా వారిని కఠినంగా శిక్షించాలి’ అని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్‌కు ట్యాగ్ చేస్తూ రైనా వరుస ట్వీట్లు చేశాడు.
మొదట దుబాయ్ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు బీసీసీఐ రూల్స్ ప్రకారం 6 రోజుల ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. దుబాయ్‌లో తనకు కేటాయించిన గది.. రైనాకు మొదటి రోజే నచ్చలేదు. కనీసం ఆ గదికి సరైన బాల్కనీ కూడా లేదని రైనా అసంతృప్తి వ్యక్తం చేశాడట. కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇచ్చిన తరహా గది తనకు కావాలంటూ కోరడంతో గొడవ జరిగిందని మరో ప్రచారం కూడా జరుగుతూ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని రైనా తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు కూడా కథనాలు వచ్చాయి. ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై తరఫున ఆడుతున్న సురేష్ రైనా.. కేవలం హోటల్ గది గురించి తప్పుకోడని.. ప్రాంచైజీతో ఇంకా పెద్ద గొడవే జరిగినట్టు పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
వీటన్నిటికీ తెరదించుతూ సురేష్ రైనా తాజాగా స్పందించాడు. క్రిక్ బజ్ తో మాట్లాడిన రైనా తనకు.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి మధ్య ఎటువంటి గొడవ జరగలేదని స్పష్టం చేశాడు. కుటుంబం కోసమే వచ్చానని అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా తనకు కుటుంబం లాంటిదేనని.. మహి భాయ్(మహేంద్ర సింగ్ ధోని) నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. దుబాయ్ నుండి తిరిగి వచ్చేయడం అన్నది చాలా కఠినమైన నిర్ణయం.. నాకు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఎటువంటి గొడవలు లేవు అని రైనా చెప్పుకొచ్చాడు.
'భారత్ లో లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో కూడా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను.. తిరిగి నన్ను చెన్నై క్యాంపులో ఎప్పుడు చూస్తారో చెప్పలేను' అని రైనా అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ కు కూడా తాను భారత్ కు ఎందుకు వచ్చేశానో తెలియదని అన్నాడు. శ్రీనివాసన్ నాకు తండ్రి లాంటి వారు.. నాకు చాలా విషయాల్లో అండగా నిలబడి ఉన్నారు. తన గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఓ తండ్రి అన్న మాటల్లా స్వీకరిస్తానని చెప్పుకొచ్చాడు రైనా. ఓ తండ్రి తన కొడుకును తిట్టే అధికారం ఉంటుందని అన్నాడు రైనా. ఈ వ్యాఖ్యలను బట్టి రైనా చెన్నై జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది.