స్వదేశం తిరిగి రావడానికి గల కారణం చెప్పిన రైనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sep 2020 8:01 AM GMT
స్వదేశం తిరిగి రావడానికి గల కారణం చెప్పిన రైనా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్‌ కూడా మిస్‌ కానీ ఆటగాడు సురేష్‌ రైనా. 2008 నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరుపున ఆడుతున్న రైనా.. ఆ జట్టు సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఈ సీజన్‌ నుంచి రైనా అర్థాంతరంగా తప్పుకున్నారు. రైనా వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు దూరం అయినట్లు చెన్నై జట్టు సోషల్ మీడియాలో వెల్లడించగా.. అయితే.. ఏ కారణం అనేది మాత్రం వెల్లడించలేదు.

ఈ నేపథ్యంలో కరోనా భయం.. కుటుంబంపై బెంగ, సన్నిహితుల మరణం... ఫ్రాంచైజీతో విభేదాలు.. రైనా నిష్క్రమణకు కారణాలంటూ ప్రచారం జరిగింది. రైనా ఈ సీజన్‌లో ఎంత నష్టపోతాడో తెలుసుకుని తిరిగి వస్తాడు అని ఆ జట్టు యజమాని శ్రీనివాసన్‌ వ్యాఖ్యానించినట్లు వార్తలు వినిపించాయి. కాగా.. అసలు తాను ఎందుకు ఇండియాకు రావాల్సి వచ్చిందో గల కారణాలను రైనా వివరించే ప్రయత్నం చేశాడు. పంజాబ్‌లో తన మేనత్త కుటుంబంపై జరిగిన దాడి దారుణమని, తన మామాను దుండగులు అతి కిరాతకంగా చంపారని రైనా ఆవేదన వ్యక్తం చేశాడు.



‘పంజాబ్‌లో మా బంధవులపై జరిగింది చాలా దారుణం. మా మామ‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు. దుండగుల దాడిలో మా అత్త, ఇద్దరు కజీన్స్ తీవ్రంగా గాయపడ్డారు. దురదృష్టవశాత్తు చికిత్సపొందుతూ మా కజిన్ గత రాత్రి ప్రాణాలు విడిచారు. మా అత్తమ్మ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. మృత్యువుతో పోరాడుతుంది. ఈ రోజుకి ఆరాత్రి ఏం జరిగిందనేదానిపై స్పష్టత లేదు. ఎవరు చేశారనేది తెలియడం లేదు. పంజాబ్ పోలీసులను నేను కోరేది ఒక్కటే.. దుండగులను వదిలిపెట్టవద్దు. వారిని పట్టుకునే మార్గాలున్నాయి. ఇలాంటి దారుణాలు మళ్లీ చేయకుండా వారిని కఠినంగా శిక్షించాలి' అని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్‌కు ట్యాగ్ చేస్తూ రైనా వరుస ట్వీట్లు చేశాడు.

రైనా మామ (మేనత్త భర్త)‌ అశోక్‌ కుమార్‌ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దోపిడీ దొంగల దాడిలో అశోక్‌ ప్రాణాలు కోల్పోగా నలుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ పఠాన్‌కోఠ్ జిల్లాలో ప్రభుత్వ కాంట్రాక్టర్ అయిన అశోక్ కుమార్(58) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నారు. ఈ నెల 19న రాత్రి వీరు డాబాపై నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు వీరి ఇంట్లోకి ప్రవేశించి దోపిడికి ప్రయత్నించారు. అయితే వారిపై అశోక్‌తో పాటు కుటుంబ సభ్యులు తిరగబడటంతో బలమైన ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. కొంత నగదు, బంగారం దోచుకెళ్లారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఒకరు సోమవారం రాత్రి ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కాగా.. రైనా తాజా ట్వీట్‌ను చూస్తే.. అతని కుటుంబం దారుణ హత్యకు గురవడంతోనే భారత్‌కు వచ్చినట్లు స్పష్టం అవుతుంది.

Next Story