20 ఓవర్లలో 92 పరుగులను కాపాడుకున్న డారెన్ సామీ టీమ్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sep 2020 12:18 AM GMT
20 ఓవర్లలో 92 పరుగులను కాపాడుకున్న డారెన్ సామీ టీమ్..!

కీరన్ పోలార్డ్ ఊచకోత మరవక ముందే బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు మరో ఘోరమైన ఓటమిని కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో చవి చూసింది. చాలా సులువుగా చేతికొచ్చిన మ్యాచ్ ను చేజేతులా కోల్పోయింది బార్బడోస్ ట్రైడెంట్స్ టీమ్..! డారెన్ సామీ సేన సెయింట్ లూసియా జూక్స్ 92 పరుగులను కాపాడుకుంది. మూడు పరుగుల తేడాడో బార్బడోస్ జట్టు ఓటమిని మూట గట్టుకుంది.

అసలే చాలా లో స్కోరింగ్ మ్యాచ్.. ప్రత్యర్థి జట్టు 20 ఓవర్లు కూడా ఆడలేక 92 పరుగులకే ఆలౌట్ అయింది.. 32 పరుగుల వద్ద తమ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది.. ఆ తర్వాత బార్బడోస్ ఆటగాళ్ల అతి జాగ్రత్త ఆ జట్టు కొంప ముంచింది. వచ్చిన ఆటగాళ్లు వచ్చినట్లు బాల్స్ ఎక్కువగా ఆడేయడం.. ఏదో షాట్ ఆడడానికి వెళ్లి వికెట్ ను కోల్పోవడం.. అలా.. అలా చివరికి మ్యాచ్ మంచి రసపట్టులోకి మారగా డారెన్ సామీ సేన విజయాన్ని బార్బడోస్ చేతుల్లో నుండి తీసుకుని వెళ్ళిపోయింది. భారీ స్కోర్స్ కు కేరాఫ్ అడ్రెస్ అయిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో అతి తక్కువ స్కోరును కాపాడుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది సెయింట్ లూసియా జూక్స్.

టాస్ గెలిచిన బార్బడోస్ జట్టు సెయింట్ లూసియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. సెయింట్ లూసియా ఆటగాళ్లు వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా వికెట్లను ఇచ్చేసి వెళ్లిపోయారు. నజీబుల్లా చేసిన 22 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు. 20 ఓవర్లు కూడా ఆడకుండానే 18 ఓవర్ లో 92 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. హేడెన్ వాల్ష్ జూనియర్ మూడు వికెట్లు తీసి రాణించాడు. మిగిలిన బౌలర్లు కూడా మంచి ప్రదర్శన చేశారు.

స్వల్ప స్కోరు చేధించే తరుణంలో ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ మంచి ఆటతీరును కనబరిచాడు. కానీ మిగిలిన ఆటగాళ్లెవరూ పరుగులు చేయడానికి పెద్దగా ప్రయత్నించలేదు. జాన్సన్ ఛార్లెస్ 39 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ బంతులు ఎక్కువగా ఆడుతూ రన్ రేట్ పెరిగేలా చేసారు. 30 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన దశ నుండి 12 బంతుల్లో 13 పరుగులు.. 6 బంతుల్లో 9 పరుగుల దాకా తీసుకుని వచ్చారు. ఆఖరి ఓవర్ వేసిన 'చేస్' బార్బడోస్ బ్యాట్స్మెన్ కు స్కోరు కొట్టే అవకాశం ఇవ్వలేదు. దీంతో మూడు పరుగుల తేడాతో సెయింట్ లూసియా విజయాన్ని సాధించింది. మూడు ఓవర్లు వేసి 11 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసిన జెవెళ్లే గ్లెన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 20 ఓవర్లలో 92 పరుగులను కాపాడుకోవడం చాలా అరుదు.. ఆ ఫీట్ ను డారెన్ సమీ జట్టు చేసి చూపించింది.

Next Story