మోర్గాన్, మలాన్ నిలిచారు.. పాకిస్థాన్ కు చుక్కలు చూపించారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sep 2020 12:02 AM GMT
మోర్గాన్, మలాన్ నిలిచారు.. పాకిస్థాన్ కు చుక్కలు చూపించారు

పాకిస్థాన్ భారీ స్కోరు కొట్టినా కూడా మ్యాచ్ ను కాపాడుకోలేకపోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, డేవిడ్ మలాన్ లు పాకిస్థాన్ కు విజయాన్ని దూరం చేశారు. మొదటి టీ-20 వర్షం కారణంగా రద్దవగా.. రెండో టీ-20లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0తో లీడ్ సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ మరోసారి తన బ్యాటింగ్ తో అలరించాడు. ఫకర్ జమాన్ తో కలిసి మొదటి వికెట్ కు 72 పరుగుల పార్ట్నర్ షిప్ ను నమోదు చేశాడు బాబర్ ఆజమ్. 44 బంతుల్లో బాబర్ ఆజమ్ 56 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. ఫకర్ జమాన్ 36 పరుగులతో రాణించాడు. హఫీజ్ చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతుల్లో 69 పరుగులు సాధించాడు. నాలుగు సిక్సర్లు కూడా ఉండడం విశేషం. మాలిక్ 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 20 ఓవర్లు ముగిసే సమయానికి 195 పరుగులు చేసింది పాకిస్థాన్ జట్టు. ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీయగా, టామ్ కుర్రన్, జోర్డాన్ లు చెరో వికెట్ తీశారు.

భారీ స్కోర్ ను చేధించే పనిని ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్లు మొదలుపెట్టారు. పవర్ ప్లే లో టామ్ బ్యాంటన్, జానీ బెయిర్ స్టోలు 65 పరుగులు సాధించి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఏడో ఓవర్ రెండో బంతికి 44 పరుగులు చేసిన బెయిర్ స్టో ను అవుట్ చేసిన షాదాబ్ ఖాన్ ఆ తర్వాతి బంతికి 20 పరుగులు చేసిన టామ్ బ్యాంటన్ ను బోల్తా కొట్టించాడు. 66 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు ఏ మాత్రం తడబడకుండా లక్ష్యాన్ని చేధించిందంటే అందుకు కారణం డేవిడ్ మలాన్, ఇయాన్ మోర్గాన్ భాగస్వామ్యమే కారణం.

మోర్గాన్ సిక్సర్లతో అలరించగా.. మలాన్ నిలకడగా ఆడుతూ అర్ధశతకాలను పూర్తీ చేసుకున్నారు. వీరిరువురూ వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మోర్గాన్ 33 బంతుల్లో 66 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. మలాన్ 54 పరుగులతో నాటౌట్ గా నిలిచి లాంఛనాన్ని పూర్తీ చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు తీసుకోగా.. హారిస్ రవూఫ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇయాన్ మోర్గాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇప్పటికే టెస్టు సిరీస్ ను కోల్పోయిన పాకిస్థాన్.. టీ-20 సిరీస్ ను కాపాడుకోవాలంటే సెప్టెంబర్ 1న జరిగే మూడో టీ20ని గెలిచి తీరాల్సిందే..! ఎన్నో ఆశలతో ఇంగ్లాండ్ లోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు విజయాన్ని చూడకుండానే తిరిగి స్వదేశం చేరుతుందా లేదా అన్నది ఇంకో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.

Next Story