అమెరికాలో మృత్యు మృదంగం.. భారత్‌లో 5 వేలకు చేరువలో కేసులు

By అంజి  Published on  8 April 2020 7:15 AM IST
అమెరికాలో మృత్యు మృదంగం.. భారత్‌లో 5 వేలకు చేరువలో కేసులు

హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజు రోజుకు ఈ వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా విజృంభణతో యావత్‌ అన్ని దేశాలకు కంటి మీద కునుకు కరువయ్యింది. ముఖ్యంగా యూరప్‌ దేశాలు, అమెరికాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. అమెరికాలో గత 24 గంటల్లో 1,150 మంది మృతి చెందారంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో, వైరస్‌ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

న్యూయార్క్‌లో ఉంటున్న తెలుగు వాసి తాజాగా కరోనా కాటుకు ప్రాణాలు విడిచారు. ప్రకాశం జిల్లా ఏదుబాడు గ్రామానికి చెందిన బ్రహ్మానందం అమెరికాలో విలేఖరిగా పని చేస్తున్నారు. 10 రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. న్యూజెర్సీ, న్యూయార్క్‌ రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లు ఈ మహమ్మారి బారిన పడ్డారు. గత 24 గంటల్లో న్యూయార్క్‌లో 7312 మంది చనిపోయారు.

బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా బారిన పడ్డ ఆయనను తాజాగా ఐసీయూ చేర్చి చికిత్స అందిస్తున్నారు.

కరోనా ఉద్భవించిన చైనా దేశంలో తాజాగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. వైరస్‌ సంబంధిత మరణాలేవీ చోటు చేసుకోకపోవడంతో.. దీన్ని కరోనాపై పోరులో ఓ మైలురాయిగా అక్కడి అధికారులు అభివర్ణిస్తున్నారు.

భారత్‌లో కరోనా కేసులు 5 వేలకు చేరువ అవుతున్నాయి. ఇప్పటివరకు 4,789 మంది కరోనా సోకింది. నిన్న ఒక్క రోజే 500కుపైగా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 124కు చేరుకుంది. లాక్‌డౌన్‌ కట్టడి కొన్ని రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలను ఇచ్చాయి. కేసులు పెరుగుతుండటంతో వివిధ రాష్ట్రాలు తమ పరిధిలో ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

జపాన్‌ దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నెల రోజుల పాటు ఎమర్జెన్సీ విధించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు లక్ష కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది.

Next Story