నవ్వే ఆయన్ని 112 ఏళ్లు బ్రతికించింది

By రాణి  Published on  26 Feb 2020 3:43 PM IST
నవ్వే ఆయన్ని 112 ఏళ్లు బ్రతికించింది

ఆయనకు ఫిబ్రవరి 12 నే ప్రపంచంలోని అతి వృద్ధుడైన వ్యక్తిగా గిన్నెస్ అవార్డు వచ్చింది. ముఖమంతా బోసి నవ్వుతో, పిడికిలి బిగించి మరీ ఆయన ఆ అవార్డును తీసుకుని ఫోటోలకు పోజులిచ్చాడు. ఆయన పేరు చితెత్సు వతానబే. ఆయనది జపాన్.

ఇప్పుడు ఆ ఓల్డెస్ట్ లివింగ్ మాన్ ఫిబ్రవరి 23 న తుదిశ్వాస విడిచాడు. కడదాకా ఆరోగ్యంగా ఉన్న వతానబే చివరి వారం పది రోజుల్లో మాత్రం ఏమీ తినడానికి ఇష్టపడలేదు. ఆ తరువాత కొద్దిగా జ్వరం వచ్చింది. పెద్దగా అనారోగ్య కారణాలేవీ లేకపోయినా, వార్థక్య జనిత కారణాలతో చనిపోయాడు. వతానబేకి అయిదుగురు సంతానం, 12 మంది మనవళ్లు, మనవరాళ్లు, 16 మంది మునిమనవళ్లు, ఒక ముని ముని మనవడు ఉన్నారు. ఛనిపోయేనాటికి అతనికి 112 ఏళ్లు.

ఈ వృద్ధాతి వృద్ధుడు 1907 లో పుట్టాడు. దాదాపు పదేళ్ల పాటు తైవాన్ లో పనిచేసి తిరిగివచ్చాడు. అప్పట్నుంచీ నిగటా నగరంలో ఉద్యోగం చేశాడు. రిటైరయ్యే దాకా అక్కడే ఉన్నాడు. ఆ తరువాత బోన్సై చెట్లు పెంచుతూ, పళ్ల తోటలు పెంచుతూ కాలం గడిపాడు. రైతుగా ఉండటానికి, చెమటలు కార్చి పనిచేయడాన్ని ఆయన చాలా ఇష్టపడేవాడు. నిత్యం నవ్వుతూ ఉండటమే తన ఆరోగ్య రహస్యమని ఆయన తరచూ చెప్పేవాడు. ఈయన కన్నా ముందు జీవించి ఉన్న ఓల్డెస్ట్ మ్యాన్ గా గిన్నెస్ కి ఎక్కింది కానే తనాకా..ఆయన కూడా జపనీయుడే..

ఇంతకీ ఇన్నేళ్లు బ్రతికే ఆ రహస్యమేమిటో జపనీయులకే తెలిసినట్టుంది. వెళ్లిolపోదామా జపాన్ కి..ఆ రహస్యమేమిటో తెలుసుకుందామా..?

Next Story