చైనాను గడగడలాడిస్తోన్న కోవిడ్ 19(కరోనా వైరస్) ప్రస్తుతం 33 ప్రపంచ దేశాలకు వ్యాపించింది. 33 దేశాల్లో కోవిడ్ బారిన పడిన వారు సుమారు 80 వేలకు ఉండొచ్చని వైద్యుల అంచనా. ఇక కోవిడ్ మృతుల సంఖ్య అయితే 2800కు చేరుతోంది. ప్రస్తుతం పశ్చిమాసియా, ఇరాన్ దేశాలను బెంబేలెత్తిస్తోంది కోవిడ్ 19. ఇరాన్ లో ఇప్పటి వరకూ 95 కేసులు నమోదవ్వగా..15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ కూడా ఈ వైరస్ బారిన పడ్డారంటే..అక్కడ వైరస్ వ్యాప్తి తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇరాన్ ఆరోగ్య మంత్రి ఇరాజ్ హరిర్చి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ”నాకు కరోనా ఇన్ఫెక్షన్ సోకింది. కానీ వైరస్ ను తప్పకుండా ఓడిస్తాననే నమ్మకం ఉంది” అని ఆయన తెలిపారు. కాగా..నిజానికి కోవిడ్ బారిన పడి ఎక్కువమంది చనిపోయినప్పటికీ..ఆ సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది.

ఇరాన్ తో పాటుగా ఇరాక్, కువైట్, బెహ్రెయిన్, ఒమన్, ఆప్షనిస్థాన్ దేశాలకు కూడా ఈ వైరస్ విస్తరించింది. అంతేకాక యూఏఈ, కెనడా, లెబనాన్ దేశాలు..తమ దేశస్తులకు ఇరాన్ నుంచే వైరస్ వ్యాపించిందని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా అమెరికా ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతోన్న ఇరాన్ కరోనా ముప్పును ఎదుర్కోవడం కష్టమేనన్న సంకేతాలు వస్తున్నాయి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.