కరోనా గాలి ద్వారా సోకుతుందా..? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది
By సుభాష్ Published on 4 April 2020 3:06 AM GMTకరోనా వైరస్ ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఈ మహమ్మారి వల్ల వేలాదిగా ప్రాణాలు కోల్పోగా, లక్షల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా వైరస్ వచ్చిన నాటి నుంచి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ప్రజలకు ఈ వైరస్ సోకడం కంటే అనుమానాలే ఎక్కువగా వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి అపోహాలపై ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ ఎన్నో సూచనలు, సలహాలు అందజేసింది.
అయితే ఈ వైరస్ గురించి మరో వార్త వైరల్ అవుతోంది. కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందని పుకార్లు షికార్లు అవుతున్నాయి. ఈ మాటను ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ (WHO) కొట్టిపారేసింది. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించదని స్పష్టం చేసింది. కేవలం దగ్గినా.. తుమ్మినా తుంపర్ల ద్వారానే సంక్రమిస్తుందని వెల్లడించింది. కరోనా రోగి దగ్గరలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గినా.. తుమ్మినా... అది కూడా ఆ వ్యక్తికి మరి దగ్గర ఉంటేనే ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిపింది.
తుమ్మినప్పుడు గాల్లోకి వెళ్లే తుంపర్లు కొద్దిసేపటి వరకు ఉంటాయి. అవి కూడా బరువు ఎక్కువగా ఉండటం వల్ల కొద్ది క్షణాలు మాత్రమే గాల్లో ఉంటాయి. తుంపర్లు ఉండే పరిణామాన్ని బట్టి అవి వ్యాప్తి చెందుతాయి.. అని తెలిపింది.
కరోనా వైరస్ సోకిన వ్యక్తికి ఒక మీటర్ కంటే తక్కువ దూరంలో ఉన్నప్పుడు తుమ్మినా, దగ్గినా 5 నుంచి 10 మైక్రోన్ల సైజులో మన శరీరంపై పడే ప్రమాదముందని తెలిపింది. లేదంటే అటువంటి తుంపర్లు పడిన ప్రదేశాన్ని మనం తాకితే వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని పేర్కొంది.
అలాగే మైక్రోన్స్ కంటే తక్కువ వ్యాసం ఉంటే గాల్లోనే ఒక మీటర్ దూరం వరకూ తిరుగుతుంటాయని, కొన్ని సార్లు చాలా సమయం వరకూ అవి బతికి ఉండే అవకాశాలున్నాయని, అలాంటి సమయంలో గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా అరుదు అని పేర్కొంది.
చికిత్స జరుగుతున్న సమయంలో..
కాగా, వైరస్ సోకిన రోగికి చికిత్స జరుగుతున్న సమయంలో గాలిని పైపుల ద్వారా అందించే ప్రక్రియలో గానీ, వెంటిలేటర్ల ద్వారా చికిత్స జరుగుతున్న సమయంలో పైపు లీకేజి ద్వారా రోగి నుంచి వచ్చే తుంపర్లు దగ్గరలో ఉన్న వ్యక్తులకు సోకే ప్రమాదం ఉందని తెలిపింది. ఇక కరోనా సోకిన వ్యక్తి తుంపర్లు గాల్లో కలిసి మనకు కూడా సోకే ప్రమాదం ఉందనుకోవడం అపోహ మాత్రమేనని ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ కొట్టిపారేసింది.