ఇక లాక్‌డౌన్‌ కఠినతరం.. రోడ్డుపైకి వచ్చారంటే ఇక అంతే..

By సుభాష్  Published on  3 April 2020 1:58 PM GMT
ఇక లాక్‌డౌన్‌ కఠినతరం.. రోడ్డుపైకి వచ్చారంటే ఇక అంతే..

దేశ వ్యాప్తంగా కరోనాతో రోజురోజుకు పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక లాక్‌డౌన్‌ ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కేంద్రం పిలుపునివ్వడంతో హైదరాబాద్‌ పోలీసులు లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నారు. గత వారం రోజులుగా లాక్‌డౌన్‌ ఉల్లంఘన కింద దాదాపు రెండు లక్షల వాహనాలపై కేసులు నమోదైనట్లు అధికారులు వివరిస్తున్నారు. ఒక్క రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనే 50 వేలకుపైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అత్యవసరమైన సమయంలోనే బయటకు రావాలని పోలీసులు ఎన్ని విధాలుగా సూచిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. దీంతో పోలీసులు కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చినట్లయితే పోలీసులు కోరఢా ఝులిపించనున్నారు. స్థానిక పోలీసులు సదరు వాహనదారుడిపై ఐపీసీ 188, 271, 188, ప్రాణాంతక వ్యాధులు, ప్రాణాలకు ముప్పు, క్వారంటైన్‌ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం వంటి పలు అంశాలపై కేసులు నమోదు చేసి, జైలు శిక్ష వేయనున్నారు. గరిష్టంగా రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story
Share it