5జి నెట్‌ వర్క్‌ భవిష్యత్తును శాసించబోతుందా...?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Oct 2019 7:41 AM GMT
5జి నెట్‌ వర్క్‌ భవిష్యత్తును శాసించబోతుందా...?!

తరం మారుతోంది. ఒక తరం మారేలోపే టెక్నాలజీ మరో తరంలోకి మారిపోతోంది. 2జి, 3జి, 4జి దాటి ఇప్పుడు 5జి దశ వచ్చేసింది. దక్షిణ కొరియా, అమెరికా, చైనా తదితర దేశాలు ఇప్పటికే 5జి వాణిజ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. మనదేశం మాత్రం ఇంకా పరీక్షల స్థాయిని కూడా పూర్తి చేయలేదు. 5జి టెక్నాలజీ దిశగా మనదేశం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. 2020 నాటికి 5జి సాంకేతికతను దేశంలో ప్రవేశపెట్టే దిశగా మోదీ సర్కారు కసరత్తు చేస్తోంది.

5జి అంటే?

5జి... అడ్వాన్స్ డ్ టెక్నాలజీకి ప్రతిరూపం. మెరుపు వేగంతో డేటా డౌన్‌లోడ్‌ చేసుకుంటూ ఎలాంటి అంతరాయం లేకుండా సమాచారాన్ని అందించేదే 5జి సెల్యూలర్‌ టెక్నాలజీ. 5జి టెక్నాలజీ ద్వారా సెకన్‌కు 2 గిగాబిట్ల నుంచి 20 గిగాబిట్ల వేగంతో సమాచార మార్పిడి చేయవచ్చు. మనదేశంలో ప్రస్తుతం వాడుతున్న 4జి లింక్‌ వేగం 6 నుంచి 7 మెగాబిట్లు మాత్రమే.

5జి టెక్నాలజీ ప్రయోజనాలు

5జి టెక్నాలజీ వాడే యూజర్లు క్షణాల్లో ఎంత భారీ సమాచారాన్నానైనా డౌన్‌లోడ్‌ చేసుకోగలుగుతారు. 8కె రిజల్యూషన్‌ ఉన్న సినిమాలయినా, భారీ గ్రాఫిక్స్‌ ఉండే గేమ్స్‌ అయినా క్షణాల్లో డౌన్‌లోడ్‌ అవుతాయి. సమాచార మార్పిడి, భారీ స్థాయిలో అప్లికేషన్లను ఒకేసారి నిర్వహించడం లాంటి పెద్ద అవసరాలకు 5జి వెన్నముకలా నిలుస్తుంది. డ్రైవర్‌ రహిత వాహనాలను నడిపించడం, టెలిఫోన్‌ సేవల ఆధారంగా శస్త్రచికిత్సలు నిర్వహించడం, రియల్‌ టైం డేటా విశ్లేషణలో 5జి టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతుంది. 5జి సేవలతో వస్తు తయారీ, వ్యవసాయం, రవాణా మౌలిక సదుపాయాలు ఊహించనంత సాంకేతికతను అందుకుంటాయి. ఐతే, మార్కెట్లో 5జి వస్తే యూజర్లు దానికి సరిపోయే చేసే ఫోన్లలోకి మారాల్సి ఉంటుంది. వ్యక్తిగత అవసరాలకు 5జి వాడాలంటే చాలా సమయం పట్టొచ్చు. మార్కెట్లోకి 5జి సేవలు వచ్చినా ఇప్పటివర కున్న 2జి, 3జి, 4జి సేవలు కొనసాగుతాయి. కొత్త సాంకేతికలోకి పూర్తిగా మారడానికి మరో పదేళ్లు పట్టే అవకాశముంది.

Advertisement

ఆర్థికంగా ఎలాంటి ప్రభావం?

5జి టెక్నాలజీతో 2035 కల్లా భారత ఆర్థిక వ్యవస్థలో 1 ట్రిలియన్ డాలర్ల మేర వాణిజ్యం జరిగే అవకాశముంది. ప్రముఖ టెలికం కంపెనీ ఎరిక్‌సన్‌ నివేదిక ప్రకారం 2026 కల్లా దాదాపు 27 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుంది. 2025 కల్లా దాదాపు 7 కోట్ల 5జి కనెక్షన్లు తీసుకోవచ్చని GSMA అంచనా వేసింది.

మార్కెట్లోకి 5జి ఎప్పుడు రావొచ్చు?

ప్రపంచంలో అందరికంటే ముందు ఏప్రిల్‌లో దక్షిణ కొరియా 5జి సేవలను తీసుకొచ్చింది. అది జరిగిన కొన్ని గంటల్లోనే అమెరికా 5జిని ప్రవేశపెట్టింది. పోటీలో నేనున్నానంటూ చైనా కూడా 5జి వాణిజ్య సేవలు తెచ్చింది. మన దేశంలో 5వ తరం సాంకేతిక సేవల్లో పరిశోధనలు, ఆధునిక ఆవిష్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం 2018 మార్చ్ నెలలో మూడేళ్ల కార్యాచరణ ప్రకటించింది. ఇందుకోసం బడ్జెట్ లో 224 కోట్లు కేటాయించింది. ప్రముఖ టెలికం కంపెనీ ఎరిక్సన్ కూడా 5జీ పరీక్షల కోసం ఐఐటీ ఢిల్లీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది.

Advertisement

స్పెక్ట్రం వేలం

5జి సేవల నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే స్పెక్ట్రమ్‌ వేలం వేయాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా, అందుబాటులో ఉన్న స్పెక్ట్రం మొత్తం వేయాలని 2018 ఆగస్టులో ట్రాయ్ ప్రతిపాదించింది. ఈ లెక్కన 8,664 మెగా హెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ వేలంలోకి రానుంది. గతంలో వేలంలో వచ్చిన స్పెక్ట్రమ్ తో పోలిస్తే ఇది చాాలా ఎక్కువ. వేలంలోకి వచ్చే తరంగాల మొత్తం కనీస ధర సుమారు 4లక్షల 90వేల కోట్ల రుపాయలు ఉండొచ్చని అంచనా. స్పెక్ట్రం వేలం ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరు. 2016 అక్టోబర్ లో నిర్వహించిన వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.65 వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఐతే, ఆ వేలంలో 60 శాతం అమ్ముడుపోకుండా ఉండిపోయింది. 5వ తరం స్పెక్ట్రమ్ విషయానికి వస్తే, 3300-3660 మెగా హెర్జ్ తరంగాలకు బిడ్లు ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి ఒక మెగా హెర్జ్ కనీస ధరను రూ. 492 కోట్ల రూపాయలుగా ట్రాయ్ ప్రతిపాదించింది.

వేలానికి అడ్డంకులు?

ప్రస్తుతమున్న 3 ప్రధానమైన టెలికం కంపెనీల్లో రెండు కంపెనీలు ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా స్పెక్ట్రమ్‌ వేలంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర చాలా ఎక్కువగా ఉందన్నది వీటి ప్రధాన అభ్యంతరం. సెల్యూలార్ ఆపరేటర్స్ సమాఖ్య కూడా అభ్యంతరం చెబుతోంది. ప్రస్తుతం టెలికం రంగం రూ.7 లక్షల కోట్ల భారీ నష్టాలతో నడుస్తోంది. ఈ నేపథ్యంలో టెలికం రంగానికి భారీ ధరలు ఇబ్బందికరమని సెల్యూలర్‌ ఆపరేటర్స్‌ అసొసియేషన్‌ అభిప్రాయం. ఈ నేపథ్యంలో 5జి విషయంలో ధరలను కనీసం 43శాతం తగ్గించాలంటోంది. ఈ క్రమంలో ట్రాయ్ ప్రతిపాదనల ప్రకారం స్పెక్ట్రమ్ వేలం, ధరల విషయంలో టెలికం శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది

స్పెక్ట్రమ్‌ విషయం పక్కనబెడితే 5జి రావాలంటే సమాచార వ్యవస్థలో కొన్ని మౌలికపరమైన మార్పులు రావాలి. కేవలం టెక్నాలజీ పెరిగినంత మాత్రాన 5జి వినియోగించే వ్యవస్థలకు పెద్ద ప్రయోజనం ఉండదు. 5జి నెట్‌ వర్క్‌ వినియోగించే సంస్థలు సాంకేతికతకు అదనంగారూ. 4 నుంచి రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులతో భారీ మార్పులు చేపట్టాలన్నది టెక్‌ దిగ్గజం డెలాయిట్‌ అభిప్రాయం.

- రంజన్, సీనియర్ జర్నలిస్ట్

Next Story
Share it