శ్రీలంకను చిత్తు చేసి సెమీస్‌కు చేరిన టీమిండియా

వన్డే వరల్డ్‌ కప్‌-2023లో భారత్‌ విజయాల పరంపర కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  2 Nov 2023 8:51 PM IST
World cup-2023, india, sri lanka, cricket,

శ్రీలంకను చిత్తు చేసి సెమీస్‌కు చేరిన టీమిండియా

వరల్డ్‌ కప్‌-2023లో భారత్‌ విజయాల పరంపర కొనసాగుతోంది. ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. బౌలర్ల దాటికి శ్రీలంక బ్యాటర్లు గ్రౌండ్‌లో నిలవలేక పోయారు. వరుసగా పెవిలియన్‌కు చేరారు. 358 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన శ్రీలంక.. కేవలం 55 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. తద్వారా భారత్‌ 302 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇండియా వరుసగా ఏడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సెమీ ఫైనల్స్‌కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది భారత్.

ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ను ఎంచుకుంది శ్రీలంక. బ్యాటింగ్‌కు దిగిన భారత్ 8 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. 358 పరుగుల ఛేదనలో శ్రీలంక.. కనీసం పోటీకూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక.. 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్‌ అయి 302 పరగుల తేడాతో ఓడిపోయింది. టీమిండియా పేసర్లు షమీ, సిరాజ్, బుమ్రా బౌలింగ్‌కు ఒక్క బ్యాటర్‌ కూడా నిలబడలేకపోయారు. లంక బ్యాటర్లలో ఏంజెలో మాథ్యూస్‌ (12), మహీశ్‌ తీక్షణ (12 నాటౌట్‌), కసున్‌ రజిత (14)లు మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోరు చేయగా రజిత టాప్‌ స్కోరర్‌. ఆ జట్టులో ఏకంగా ఐదుగురు డకౌట్‌ కాగా ముగ్గురు సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే ఔటయ్యారు.

ఈ మ్యాచ్‌లో మహ్మద్‌ షమీ ఐదు ఓవర్లు వేసి 5 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ 3, బుమ్రా, జడేజా చెరో వికెట్‌ తీసుకున్నారు. బుమ్రా తొలి ఓవర్‌లోనే మొదటి వికెట్‌ తీశాడు. ఆ తర్వాత రెండో ఓవర్‌ వేసిన సిరాజ్‌ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. తన తర్వాత ఓవర్లో మరో వికెట్‌ తీశాడు. 3.1 ఓవర్లో నాలుగో వికెట్‌ కోల్పోయిన లంక.. 9.2వ ఓవర్‌ వరకూ కాస్త వికెట్‌ పడకుండా అడ్డుకోగలిగింది. 24 బంతులాడిన చరిత్‌ అసలంక ఒక్క పరుగే చేశాడు. ఏంజెలా మాథ్యూస్‌ .. 25 బంతులాడి 12 పరుగులు చేశాడు. ఆఖర్లో తీక్షణ, రజితలు తొమ్మిదో వికెట్‌కు 20 పరుగులు జోడించడంతో ఆ జట్టు అతికష్టమ్మీద 50 రన్స్‌ చేయగలిగింది. వరల్డ్‌ కప్‌-2023 పాయింట్స్‌ టేబుల్‌లో భారత్‌ 14 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఇప్పటి వరకు ఒక పరాజయం లేని టీమ్‌గా.. సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి టీమ్‌గా నిలిచింది భారత్.

Next Story