ఇర‌గ‌దీశారు..! తొమ్మిది మ్యాచ్‌ల్లో 86 వికెట్లు తీసిన భారత బౌల‌ర్లు..!

2023 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు జట్టు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ

By Medi Samrat  Published on  14 Nov 2023 2:34 PM IST
ఇర‌గ‌దీశారు..! తొమ్మిది మ్యాచ్‌ల్లో 86 వికెట్లు తీసిన భారత బౌల‌ర్లు..!

2023 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు జట్టు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఇప్పుడు బుధవారం జరిగే సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో భారత జట్టు విజయానికి బౌలర్లే కారణమని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. టీమ్ ఇండియా బౌలింగ్ అద్భుతంగా ఉంది. మొత్తం తొమ్మ‌ది మ్యాచ్‌ల‌లో 90 వికెట్లలో 86 వికెట్లు పడగొట్టింది. సెమీఫైనల్‌కు చేరిన ఇతర జట్లతో పోలిస్తే భారత బౌలర్లు అత్యధిక వికెట్లు పడగొట్టారు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా 85 వికెట్లతో రెండో స్థానంలో, ఆస్ట్రేలియా 76 వికెట్లతో మూడో స్థానంలో, న్యూజిలాండ్ 69 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి.

ఈ ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్‌కు భారత బౌలర్లు చుక్క‌లు చూపించారు. మహ్మద్ షమీ భీక‌ర‌మైన ఫామ్‌లో క‌నిపిస్తున్నాడు. షమీతో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరంతా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. ఈ ప్రపంచకప్‌లో 30 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసిన వారిలో అత్యుత్తమ ఎకానమీ రేట్ ఉన్న టాప్ 10 బౌలర్ల జాబితాలో నలుగురు భారత బౌలర్లు ఉన్నారు. వీరిలో జస్ప్రీత్ బుమ్రా 3.65 ఎకానమీ రేటుతో అగ్రస్థానంలో ఉన్నాడు. జడేజా ఎకానమీ రేటు 3.97, కుల్దీప్ 4.15, షమీ 4.78 ఉన్నారు. కగిసో రబడ (7) తర్వాత.. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన జాబితాలో బుమ్రా(6) రెండోస్థానంలో ఉన్నాడు.

ఈ ప్రపంచకప్‌లో భారత్ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడు జట్లను ఆలౌట్ చేసింది. వీటిలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. అదే సమయంలో భారత్‌ రెండు జట్లపై ఎనిమిది వికెట్లు పడగొట్టింది. వీటిలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. టీమిండియా ఇతర జట్లపై పరుగుల వర్షం కురిపించగా.. దాదాపు అన్ని జట్లు ఏదో ఒక మ్యాచ్‌లో 300కి పైగా పరుగులు ఇచ్చాయి. అదే సమయంలో ఈ ప్రపంచకప్‌లో భారత్‌పై ఏ జట్టు కూడా 300 పరుగుల స్కోరును తాకలేకపోయింది. టీమ్ ఇండియాపై న్యూజిలాండ్ అత్యధిక స్కోరు సాధించింది. ధర్మశాలలో భారత్‌పై 273 పరుగులు చేసింది. ఆ త‌ర్వాత ఆఫ్ఘనిస్తాన్ రెండవ ఉత్తమ స్కోరు(272 ) చేసింది. ఈ ప్రపంచకప్‌లో భారత్ ఐదుసార్లు ప్రత్యర్థి జట్లను 200లోపు పరుగులకే పరిమితం చేసింది. వీటిలో రెండుసార్లు భారత జట్టు 100 పరుగుల లోపు ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. టీమ్ ఇండియా స్కోరును కాపాడుకున్న ప్రతి మ్యాచ్‌లో విన్నింగ్‌ మార్జిన్ 100 లేదా అంతకంటే ఎక్కువ.

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. అదే సమయంలో తొమ్మిది మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసిన జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో షమీ 16 వికెట్లు తీయగా, కుల్దీప్ 14 వికెట్లు తీశాడు. సిరాజ్‌ పేరిట ఇప్పటి వరకు 12 వికెట్లు ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 బౌలర్లలో భారత్ నుంచి ముగ్గురు బౌలర్లు ఉన్నారు. అదే సమయంలో ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు షమీ అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో అతను ప్రతి 12 బంతులకు ఒక‌ వికెట్‌ తీస్తున్నాడు. బుమ్రా స్ట్రైక్ రేట్ 25.71, జడేజా స్ట్రైక్ రేట్ 27.56 గా ఉంది.

Next Story