అతను గేమ్‌ను మా నుంచి స్వాధీనం చేసుకున్నాడు.. ఓట‌మిపై న్యూజిలాండ్ కెప్టెన్‌

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో టీమిండియాకు రోహిత్‌, గిల్‌ మరోసారి బలమైన ఆరంభాన్ని అందించారు.

By Medi Samrat  Published on  23 Oct 2023 2:49 AM GMT
అతను గేమ్‌ను మా నుంచి స్వాధీనం చేసుకున్నాడు.. ఓట‌మిపై న్యూజిలాండ్ కెప్టెన్‌

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో టీమిండియాకు రోహిత్‌, గిల్‌ మరోసారి బలమైన ఆరంభాన్ని అందించారు. దీని తర్వాత ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు వరుసగా ఐదో విజయాన్ని అందించాడు. దీంతో 20 ఏళ్ల తర్వాత కివీప్‌పై ఐసీసీ టోర్నీలో భారత్ గెలిచింది. ఓటమి తర్వాత టామ్ లాథమ్ భారత జట్టు మెరుగైన క్రికెట్ ఆడిందని అంగీకరించాడు.

మ్యాచ్ అనంతరం కెప్టెన్‌ టామ్ లాథమ్ మాట్లాడుతూ.. "చివరి 10 ఓవర్లలో మేము బ్యాట్‌తో రాణించ‌లేక‌పోయాం. చివరి ఓవర్లలో భారత బౌలింగ్ అద్భుతంగా ఉంది. డారిల్, రచిన్ చివరి 10 ఓవర్లకు మంచి సెటప్ చేశారు.. కానీ.. మేం రాణించ‌లేక‌పోయాం. కోహ్లీ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను గేమ్‌ను మా నుంచి స్వాధీనం చేసుకున్నాడు. ఇతర బ్యాట్స్‌మెన్‌కు పనిని సులభతరం చేశాడు. కెప్టెన్‌గా మాకు అనేక ప్రణాళికలు ఉన్నాయి. ప్రతి ప్రణాళికకు కోహ్లీ సమాధానం చెప్పాడని అన్నాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 273 పరుగులు చేసింది. రచిన్ 75 పరుగులు, డారిల్ మిచెల్ 130 పరుగులు చేశారు. వీరిద్దరూ న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ క్రీజులో ఉన్నంత సేపు స్కోరు 300 దాటుతుందని అనిపించినా.. వీరిద్దరినీ ఔట్ చేయడం ద్వారా షమీ భారత్ పునరాగమనానికి తెరలేపాడు.

న్యూజిలాండ్‌పై భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు తొలుత భార‌త్ బౌల‌ర్లు షాక్‌లు ఇచ్చినా.. ఆ త‌ర్వాత రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ భాగస్వామ్యం భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. కానీ మహ్మద్ షమీ ఐదు వికెట్లు.. భారత్‌కు పునరాగమనం చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం ద్వారా.. టేబుల్ టాప్ ప్లేస్‌ సాధించింది.

Next Story