భారీ స్కోరు చేస్తుందనుకుంటే.. కుప్పకూలిన శ్రీలంక
వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక లక్నోలో తలపడుతున్నాయి.
By Medi Samrat Published on 16 Oct 2023 1:23 PM GMTవరల్డ్ కప్ లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక లక్నోలో తలపడుతున్నాయి. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ గెలవడం ఎంతో ముఖ్యం. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో వికెట్ నష్టపోకుండా 125 పరుగులతో పటిష్టంగా ఉన్న శ్రీలంక 84 పరుగుల తేడాతో 10 వికెట్లు చేజార్చుకుంది. దీంతో ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు గెలిచే అవకాశం వచ్చింది. తక్కువ స్కోరును ఆస్ట్రేలియా ఛేజ్ చేస్తుందో లేదో చూడాలి.
లంక జట్టులో ఓపెనర్ కుశాల్ పెరీరా 78, మరో ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 61 పరుగులు చేశారు. మిడిలార్డర్ లో చరిత్ అసలంక 25 పరుగులు చేయగా, మిగతా వాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. రెగ్యులర్ కెప్టెన్ దసున షనక గాయపడడంతో జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న కుశాల్ మెండిస్ (9) కూడా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించగా, మ్యాచ్ మళ్లీ మొదలైన తర్వాత లంక పతనం మొదలైంది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఓపెనర్లు ఇద్దరి వికెట్లు తీసి శ్రీలంక పతనానికి శ్రీకారం చుట్టాడు. ఇక ఆడమ్ జంపా 4 వికెట్లతో రాణించాడు. మిచెల్ స్టార్క్ 2, మ్యాక్స్ వెల్ 1 వికెట్ తో తమ వంతు సహకారం అందించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఆసీస్ బ్యాటింగ్ కు వచ్చే ముందు కూడా వర్షం అంతరాయాన్ని కలిగించింది.