భారీ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న న్యూజిలాండ్‌

ప్రపంచకప్‌లో భాగంగా జ‌రిగిన‌ 32వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి భారీ విజయాన్ని అందుకుంది

By Medi Samrat  Published on  1 Nov 2023 4:01 PM GMT
భారీ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న న్యూజిలాండ్‌

ప్రపంచకప్‌లో భాగంగా జ‌రిగిన‌ 32వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి భారీ విజయాన్ని అందుకుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 357 పరుగులు చేసింది. అనంతరం చేధ‌న‌కు దిగిన‌ న్యూజిలాండ్ 35.3 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది.

దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచకప్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో ఆఫ్రికన్ జట్టు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. మరోవైపు న్యూజిలాండ్ ఒక స్థానం కోల్పోయింది. మూడు నుంచి నాలుగో స్థానానికి ప‌డిపోయింది. ఏడు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ కు ఇది మూడో ఓటమి.

దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్లు క్వింటన్ డి కాక్, డుసెన్ సెంచరీలు చేశారు. డుసెన్ 118 బంతుల్లో 133 పరుగులు చేయ‌గా.. డికాక్ 116 బంతుల్లో 114 పరుగులు చేశాడు. డుసెన్ తన ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. డికాక్ 10 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. డేవిడ్ మిల్లర్ 30 బంతుల్లో 53 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. కెప్టెన్ టెంబా బావుమా 24 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ ఏడు బంతుల్లో 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఐడెన్ మార్క్రామ్ ఒక బంతి ఎదుర్కొని ఆరు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీషమ్ ఒక్కో వికెట్ ప‌డ‌గొట్టారు.

న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ ఫిలిప్స్ మాత్ర‌మే అర్ధ సెంచరీతో రాణించాడు. మిగ‌తా బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ రాణించ‌క‌పోవ‌డంతో న్యూజిలాండ్ 35.3 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 167 పరుగులు మాత్ర‌మే చేసి ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది. దక్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో కేశ‌వ్ మ‌హ‌రాజ్‌కు నాలుగు వికెట్లు ద‌క్క‌గా.. జాన్స‌న్ మూడు, గెరాల్డ్ రెండు వికెట్లు ప‌డగొట్టారు.

Next Story