గిల్ ఆరోగ్యంపై బీసీసీఐ చెబుతోందిదే.?
టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ ఇటీవల డెంగీ బారినపడ్డాడు.
By Medi Samrat Published on 9 Oct 2023 2:00 PM GMTటీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ ఇటీవల డెంగీ బారినపడ్డాడు. దాంతో గిల్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు దూరమయ్యాడు. తాజాగా, గిల్ ఆరోగ్యంపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. గిల్ ఇంకా కోలుకోలేదని తెలిపింది. టీమిండియా ఢిల్లీకి బయల్దేరిందని, అయితే గిల్ జట్టు వెంట వెళ్లబోవడం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. టీమిండియా అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడనుండగా, ఈ మ్యాచ్ కు కూడా గిల్ అందుబాటులో ఉండడంలేదని బీసీసీఐ తెలిపింది. గిల్ చెన్నైలోనే వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందనున్నాడని బీసీసీఐ తెలిపింది.
డెంగ్యూతో బాధపడుతూ చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు గిల్. ఇక బుధవారం ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే రెండో ప్రపంచ కప్ మ్యాచ్‌కు కూడా శుభ్‌మాన్ గిల్ దూరమయ్యాడని తెలియగానే భారత్ అభిమానులు షాక్ కు గురవుతున్నారు. వీలైనంత త్వరగా గిల్ కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు.
గిల్ అందుబాటులో లేకపోవడంతో రోహిత్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 200 పరుగుల ఛేదనలో భారత్ 2 పరుగులకు 3 వికెట్లు కోల్పోయినా.. కిషన్, రోహిత్, శ్రేయాస్ అయ్యర్ డకౌట్‌గా వెనుదిరిగారు. అయితే కోహ్లీ, రాహుల్ కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను భారత్ వైపు తిప్పారు. గిల్ 72.35 సగటుతో 105.03 స్ట్రైక్ రేట్‌తో 1230 పరుగులతో ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. తన చివరి నాలుగు వన్డేల్లో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ కొట్టాడు గిల్. అక్టోబరు 11న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత, అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ కోసం భారత్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లనుంది.