అంద‌రూ కోహ్లీ క్యాచ్ మ్యాచ్‌కు 'టర్నింగ్ పాయింట్' అంటుంటే.. జ‌డేజా మాత్రం..

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అసలు టర్నింగ్ పాయింట్ ఏమిటో భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చెప్పాడు.

By Medi Samrat  Published on  9 Oct 2023 10:59 AM GMT
అంద‌రూ కోహ్లీ క్యాచ్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అంటుంటే.. జ‌డేజా మాత్రం..

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అసలు టర్నింగ్ పాయింట్ ఏమిటో భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చెప్పాడు. విరాట్ కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ మిచెల్ మార్ష్‌ జారవిడచ‌డం మ్యాచ్‌కు కీలక మలుపు అని పలువురు నిపుణులు, అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే రవీంద్ర జడేజా ఆలోచన దీనికి భిన్నంగా ఉంది. స్టీవ్ స్మిత్ వికెటే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని రవీంద్ర జడేజా అభిప్రాయపడ్డాడు. మిచెల్ మార్ష్‌ను ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపడం ద్వారా జస్ప్రీత్ బుమ్రా భారత్‌కు గొప్ప ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ బంతికి డేవిడ్ వార్నర్ (41)కి క్యాచ్ అవుట‌య్యాడు.

దీంతో ఆస్ట్రేలియా జట్టు 2 వికెట్లకు 110 పరుగుల వద్ద ప‌టిష్ట‌ స్థితిలో నిలిచింది. స్టీవ్ స్మిత్ (46) అర్ధసెంచరీకి చేరువలో ఉన్నాడు. ఇక జడేజా స్మిత్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ ఇచ్చాడు. దీని తర్వాత లాబుస్‌చాగ్నే, కారీ వికెట్లను తీయడం ద్వారా జడ్డూ కంగారూ జట్టును వెన్నుపోటు పొడిచాడు. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో జడేజా మాట్లాడుతూ.. 10 ఏళ్లకు పైగా ఇక్కడే ఆడుతున్నందున చెన్నైలోని పరిస్థితులు తనకు తెలుసని అన్నాడు. జట్టుకు సహకారం అందించడం పట్ల జడేజా సంతోషం వ్యక్తం చేశాడు.

స్టీవ్ స్మిత్ అవుట్ కావడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని నేను భావిస్తున్నాను. స్టీవ్ స్మిత్ లాంటి బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసినప్పుడు.. కొత్త బ్యాట్స్‌మెన్ వచ్చిన వెంటనే క్రీజులో స్థిరపడి స్ట్రైక్ రొటేట్ చేయడం అంత సులభం కాదు. అందుకే.. స్టీవ్ స్మిత్ వికెట్ నా ప్రకారం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని అన్నాడు.

చెన్నైలోని పిచ్ అంటే ఇష్టం. ఇక్కడి పరిస్థితులు నాకు తెలుసు. 10-11 ఏళ్లుగా ఇక్కడ ఆడుతున్నాను. కాబట్టి అది ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలుసు. నేను నా బౌలింగ్‌ను ఆస్వాదించాను. జట్టుకు నేను అందించిన దానితో సంతోషంగా ఉన్నానని జ‌డేజా అన్నాడు.

Next Story