వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో వేగ‌వంత‌మైన సెంచ‌రీ బాదిన‌ మ్యాక్స్‌వెల్..!

ప్రపంచకప్ 2023 భాగంగా 24వ మ్యాచ్ ఢిల్లీలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జ‌ట్ల‌ మధ్య జరుగుతోంది.

By Medi Samrat  Published on  25 Oct 2023 1:06 PM GMT
వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో వేగ‌వంత‌మైన సెంచ‌రీ బాదిన‌ మ్యాక్స్‌వెల్..!

ప్రపంచకప్ 2023 భాగంగా 24వ మ్యాచ్ ఢిల్లీలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జ‌ట్ల‌ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ గెలవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 400 పరుగులు చేయాల్సిందే. మరికొద్ది సేపట్లో రెండో ఇన్నింగ్స్ ఆట ప్రారంభం కానుంది.

ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే కెరీర్‌లో 22వ సెంచరీని పూర్తిచేశాడు. అతడితో పాటు గ్లెన్ మాక్స్‌వెల్ కూడా తన వన్డే కెరీర్‌లో నాలుగో సెంచరీని పూర్తిచేశాడు. వార్నర్ 93 బంతులు ఎదుర్కొని 104 పరుగులు చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వ‌చ్చిన‌ మ్యాక్స్‌వెల్(106) చెల‌రేగిపోయాడు. కేవ‌లం 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స‌ర్ల సాయంతో సుడిగాలి సెంచరీని చేశాడు.

డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్ తో పాటు స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్‌చాగ్నే కూడా రాణించారు. ఇరువురు అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన స్మిత్ 68 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన లాబుస్‌చాగ్నే 47 బంతుల్లో 62 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ తరఫున లోగాన్ వాన్ బీక్ నాలుగు వికెట్లు తీశాడు. బాస్ డి లీడ్ రెండు వికెట్లు, ఆర్యన్ దత్ ఒక వికెట్ తీశారు.

Next Story