పిచ్చెక్కించే వాంఖ‌డే పిచ్ రిపోర్ట్‌.. టాస్ గెలిస్తే మాత్రం..!

వ‌న్డే ప్రపంచకప్-2023 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. టోర్నమెంట్‌లో నాలుగు సెమీ-ఫైనలిస్ట్ జట్లు టైటిల్ సాధించాల‌నే క‌సితో ఉన్నాయి

By Medi Samrat  Published on  14 Nov 2023 3:57 PM IST
పిచ్చెక్కించే వాంఖ‌డే పిచ్ రిపోర్ట్‌.. టాస్ గెలిస్తే మాత్రం..!

వ‌న్డే ప్రపంచకప్-2023 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. టోర్నమెంట్‌లో నాలుగు సెమీ-ఫైనలిస్ట్ జట్లు టైటిల్ సాధించాల‌నే క‌సితో ఉన్నాయి. ఈ టోర్నీలో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది భారత జట్టు. అలాగే ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టేందుకు సిద్ధ‌మైంది టీమిండియా. అయితే.. ఈసారి 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది.

ముంబైలోని వాంఖడే పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్ పిచ్‌గా పేరొందింది. పిచ్‌లోని బౌన్స్ కారణంగా బంతి బ్యాట్ పైకి వ‌స్తుంటుంది. దీంతో ఈ స్టేడియంలో చాలా ఫోర్లు, సిక్సర్లు కొడుతుంటారు. అలాగే స్టేడియం కూడా చిన్నది కాబట్టి బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా పెద్ద షాట్లు ఆడతారు. ఎర్రమట్టితో తయారైన ఈ పిచ్‌పై స్పిన్ బౌలర్లకు కచ్చితంగా కొంత సాయం అందుతుంది. ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లు కొత్త బంతిని సద్వినియోగం చేసుకోవచ్చు. బంతి పాత‌ప‌డుతున్న కొద్దీ ఫాస్ట్ బౌలర్లకు ఏమాత్రం ఉప‌యోగ‌క‌రంగా ఉండ‌దు.

ఈ మైదానం గణాంకాల గురించి మాట్లాడుకుంటే.. ఇప్పటి వరకు ఈ మైదానంలో 32 వన్డే మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 17 సార్లు, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు 15 సార్లు గెలిచాయి. దీని ప్రకారం సెమీఫైనల్‌లో ఏ జట్టు టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

ప్రపంచకప్‌లో ఈ పిచ్‌లో మూడు మ్యాచ్‌లు ఆడగా.. మూడు మ్యాచ్‌లు హై స్కోరింగ్ మ్యాచ్‌లుగా నిలిచాయి. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా తన చివరి మ్యాచ్‌ని శ్రీలంకతో ఈ మైదానంలో ఆడింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 357 పరుగులు చేసి.. శ్రీలంకను కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసింది.

Next Story