ప్రపంచకప్ 20వ మ్యాచ్ ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు తలపడ్డాయి. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 399 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 22 ఓవర్లలో కేవలం 170 పరుగులకే ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికా 229 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విక్టరీ నమోదు చేసుకుంది.
దక్షిణాఫ్రికా టీమ్‌లో రీజా హెండ్రిక్స్ 85 పరుగులు, రాస్సీ వాన్ డెర్ డస్సెన్(60) జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆపై హెన్రిచ్ క్లాసెన్ అద్భుత సెంచరీ చేశాడు. కేవలం 67 బంతుల్లో 109 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా మార్కో జాన్సెన్ కూడా 75 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో దక్షిణాఫ్రికా 50 ఓవర్ల ఆట ముగిసేసరికి 399 పరుగులు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్ రీస్ టాప్లీ మూడు వికెట్లు, ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీశాడు.
అనంతరం ఇంగ్లండ్ 22 ఓవర్లలో కేవలం 170 పరుగులకే ఆలౌటైంది. బౌలర్ మార్క్‌వుడ్ అత్యధికంగా 43 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగ్డీ, జాన్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గెరాల్డ్ కోయిట్జ్ మూడు వికెట్లు నేలకూల్చాడు. హెన్రిచ్ క్లాసెన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.