నెదర్లాండ్స్‌పై విక్టరీ.. ప్రపంచకప్‌లో ఎట్టకేలకు ఖాతా తెరిచిన శ్రీలంక..!
ప్రపంచ కప్ 2023లో 19వ మ్యాచ్ శ్రీలంక, నెదర్లాండ్స్ జట్ల మధ్య శనివారం జరిగింది.
By Medi Samrat Published on 21 Oct 2023 1:28 PM GMTప్రపంచ కప్ 2023లో 19వ మ్యాచ్ శ్రీలంక, నెదర్లాండ్స్ జట్ల మధ్య శనివారం జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు నెదర్లాండ్స్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక ఎట్టకేలకు పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఇక నెదర్లాండ్స్ కు నాలుగో మ్యాచ్‌లలో వారికి ఇది మూడో ఓటమి. అయితే, గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ప్రకంపనలు సృష్టించింది.. కానీ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆ జట్టులో సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 70 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. లోగాన్ వాన్ బీక్ 59 పరుగులతో రాణించాడు. శ్రీలంక తరఫున దిల్షాన్ మధుశంక, కసున్ రజిత అద్భుతంగా బౌలింగ్ చేసి చెరో వికెట్లు పడగొట్టారు.
ఛేదనకు దిగిన శ్రీలంక జట్టు ఆరంభంలో తడబడింది. ఆరంభంలో కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ రూపంలో రెండు భారీ వికెట్లు పడ్డాయి. అయితే, పాతుమ్ నిస్సాంక 54 పరుగులతో ఉపయోగకరమైన ఇన్నింగ్సు ఆడారు. ఆ తర్వాత సదీర సమరవిక్రమ (91 పరుగులు నాటౌట్), చరిత్ అసలంక (44 పరుగులు), ధనంజయ్ డిసిల్వా (30 పరుగులు) చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. దీంతో 263 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సాధించింది. శ్రీలంక టోర్నీలో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ విజయంతో శ్రీలంక జట్టు తొలి 2 పాయింట్లను సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో 10వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకుంది.