మహిళల భద్రతకోసం నిర్దేశించిన నిర్భయ నిధుల్లో ఒక్క రూపాయిని కూడా ఖర్చుపెట్టలేకపోవడానికి కారణం ఏంటో చెప్పాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు విజయ రెహత్ కర్ నిలదీశారు. మహారాష్ట్రకు కేంద్రం నుంచి రూ. 14,940.06 లక్షల నిధులు మంజూరుకాగా వాటిని మురగబెట్టిన రాష్ట్ర సర్కారు వినియోగించుకోలేని దుస్థితిని చాటుకుంటూ నాన్ యుటిలైజేషన్ సర్టిఫికెట్ ను సమర్పించడాన్ని ఆమె తీవ్రంగా తప్పు పట్టారు. కిందటి వారం పార్లమెంట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ సమర్పించిన నివేదిక ప్రకారం నిర్భయ నిధుల్ని వినియోగించుకోలేకపోయిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ. 2,050 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా, గడచిన ఐదు సంవత్సరాల్లో రూ. 1,656 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయని ఈ నివేదిక చెబుతోంది. తెలంగాణలో జస్టిస్ ఫర్ దిశ ఘటన, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాల్లో జరిగిన సామూహిక అత్యాచారం, హత్య ఘటనలు దేశంలో మహిళల భద్రతపట్ల చూపించాల్సిన శ్రద్ధను కళ్లకు కడుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్ పై స్పందన

తెలంగాణలో దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ సమాజంలో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని మహారాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు విజయ రెహత్ కర్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఎన్ కౌంటర్ కి మద్దతు లభించినప్పటికీ వీలైనంతవరకూ చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా ఉండడమే మంచిదని అభిప్రాయపడ్డారు. కానీ గతంలో నిర్భయ, పుణే టెక్కీ అత్యాచారం, హత్య కేసుల్లో విచారణ ఆలస్యం కావడంవల్ల జరిగిన నష్టాన్నికూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ ఎన్ కౌంటర్ సమంజసమేనంటూ దేశంలో అత్యధికులు వెలిబుచ్చిన అభిప్రాయం సరైనదే అవుతుందన్నారు.

ఇలాంటి కేసుల్లో సత్వరమే న్యాయం జరగాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల అవసరం చాలా ఉంటుందని అభిప్రాయపడ్డారామె. తెలంగాణలో జస్టిస్ ఫర్ దిశ, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాల్లో జరిగిన అత్యాచారం, హత్యోదంతాలు ఇవ్వాళ్టికీ దేశంలో మహిళల భద్రతపట్ల ఆందోళన వెలిబుచ్చాల్సిన పరిస్థితిని కళ్లకు కడుతున్నాయని విజయ అన్నారు.

అత్యంత హేయమైన అత్యాచారం, హత్య లాంటి నేరాలకు పాల్పడే వారికి కఠినాతి కఠినమైన శిక్ష పడుతుందన్న భయం ఏర్పడితే నేరాల రేటు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని విజయ అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో మహిళలకు రక్షణ కల్పించే దిశగా వ్యవస్థ తీరుతెన్నులను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని లెజిస్లేటివ్ కౌన్సిల్ డెప్యూటీ చైర్ పర్సన్ నీలమ్ ఘోరే అన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.