కరోనా బాధితులు..మరణాల్లో పురుషుల శాతమే ఎక్కువ

By రాణి  Published on  7 April 2020 7:51 AM GMT
కరోనా బాధితులు..మరణాల్లో పురుషుల శాతమే ఎక్కువ

ముఖ్యాంశాలు

  • మహిళల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ
  • పలు దేశాల అధ్యయనాల్లో వెల్లడి
  • అన్నిరంగాలతో పాటు ఆరోగ్యంలోనూ మహిళలదే పై చేయి

దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా పురుషులే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ నాలుగు వేలకు పైగా కేసులు నమోదవ్వగా వాటిలో 76 శాతం కేసులు పురుషులే ఉన్నారు. మిగతా 24 శాతం కేసులు మహిళల్లో నమోదయ్యాయి. దీంతో ఆమె అబల కాదు..సబల అన్న సామెత సార్థకమయింది. ఒక్క భారతదేశంలోనే కాదు..అమెరికా, ఇటలీ, రష్యా వంటి దేశాల్లోనూ కరోనా కేసులు, మరణాల బారిన పడుతున్న వారిలో ఎక్కువగా పురుషులే ఉన్న విషయం తేటతెల్లమైంది.

మానవాళి మనుగడకే సవాల్ విసిరిన ఈ కరోనా మహమ్మారిని జయించడంలో మహిళలు విజయం సాధిస్తున్నారని పలు అధ్యయనాల గణాంకాలు చెప్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. కరోనా మరణాల్లో అత్యధికంగా పురుషులే మరణిస్తున్నారు. కరోనా మరణాల రేటులో పురుషులది 4.7 శాతంగా ఉంటే..మహిళలది 2.8 శాతంగా ఉంది. పురుషుల కన్నా స్త్రీల్లో కరోనా కేసులు ఎందుకు తక్కువగా ఉందంటే.. స్త్రీ లకు జన్యు నిర్మాణంలోనే వైరస్ ను తట్టుకునే శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్న మాట. కరోనా మరణాల్లో ఏ లింగం వారు ఎక్కువగా ఉన్నారన్నదానిపై ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూ హెచ్ఓ వెల్లడించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

చైనాలో కరోనా తొలిదశలో మొదట పురుషులు, స్త్రీల సంఖ్య సమానంగానే ఉంది. కానీ వైరస్ విజృంభించే కొద్దీ ఎక్కువశాతం పురుషులే కరోనాతో ఆస్పత్రుల పాలయ్యారు. అక్కడ కరోనా మరణాల్లోనూ పురుషులే అధికం. ఇక ఇటలీలో కూడా ఇదే పరిస్థితి. మార్చి 20వ తేదీ వరకూ ఆ దేశమిచ్చిన పబ్లిక్ హెల్త్ డేటా ప్రకారం.. ఇటలీ కరోనా లెక్కలను పరిశీలిస్తే ఆడవారి కంటే మగవారి మరణాల రేటు రెట్టింపుస్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. కరోనా మరణాల్లో పురుషులు 70 శాతం, స్త్రీలు 30 శాతం ఉండగా..కరోనా పాజిటివ్ వచ్చినవారిలో పురుషులు 60 శాతం ఉంటే..మహిళలు 40 శాతం ఉన్నారు.

Also Read : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు..ప్రపంచమంతా అనారోగ్యం

మిచిగాన్‌ పాజిటివ్‌ కేసుల్లో మహిళలు 50 శాతం ఉండగా, మరణాల రేటు లో 39 శాతంగా ఉన్నారు. ఈ నెల 4వ తేదీ వరకు 479 (61 శాతం) మంది పురుషులు మరణించారు. వాషింగ్టన్‌లో పాజిటివ్‌ కేసుల్లో పురుషులు 44 శాతం, మహిళలు 56 శాతంగా ఉంటే..మరణాల రేటులో పురుషులది 57 శాతంగా ఉంది. న్యూయార్క్‌లో వైరస్‌ బారిన పడినవారిలో పురుషులు 55 శాతం ఉండగా, వారి మరణాల రేటు ఏకంగా 62 శాతంగా నమోదైంది. అంటే వైరస్‌బారిన పడినవారిలో మహిళలు 45 శాతం ఉన్నప్పటికీ మరణాల రేటు 28 శాతంగానే నమోదైంది. ఫ్లోరిడాలో కరోనా మరణాల్లో 53 శాతం మంది పురుషులు ఉన్నారు. గత శుక్రవారం ఒక్కరోజే నమోదైన కేసుల్లో 61 శాతం పురుషులు, 29 శాతం మహిళలు ఉన్నారు. ఇక ఇతర రాష్ర్టాల్లోని గణాంకాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

దీనిని బట్టి చూస్తే..మహిళల శరీరంలో ఇన్‌ఫెక్షన్స్‌ను తట్టుకొనే, వైరస్‌ పునరుత్పత్తిని అడ్డుకొనే శక్తి ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని బలంగా చెప్తున్నారు. వారిలో ఉన్న జన్యు నిర్మాణమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. మహిళల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో ముందుంటుంది. ఇందుకు వారిలోని హార్మోన్ల వ్యవస్థే కారణం. స్త్రీ పుట్టుకలోనే జన్యుపరంగా రెండు ఎక్స్‌ క్రోమోజోములు ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి ఒకటి చొప్పున వచ్చే ఎక్స్‌ క్రోమోజోములు డబుల్‌ డోసేజ్‌గా పనిచేయడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని అమెరికాలోని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ మైక్రోబయాలజిస్టు సబ్రా క్లెయిన్‌ తెలిపారు.

Also Read : అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్ వస్తాండాది..రెడీ కాండబ్బా..

ముఖ్యంగా ఎక్స్‌ క్రోమోజోముల్లో ఉండే 60 జన్యువులు రోగనిరోధక శక్తిలో పనిచేస్తాయని, ‘టాల్‌ టైక్‌ రెసిప్టర్‌- 7’ వైరస్‌ ఆర్‌ఎన్‌ఏను వెంటనే గుర్తించి శరీరాన్ని అప్రమత్తం చేస్తుందన్నారు. టాల్‌ టైక్‌ రెసిప్టర్‌- 7 వైరస్‌ పునరుత్పత్తిని వెంటనే అడ్డుకుంటుందని ఆమె వివరించారు. అలాగే మనిషి శరీరంపై దాడిచేసే ఇన్ఫెక్షన్లపై పోరాడటంలో సెక్స్ హార్మోన్లు కూడా పనిచేస్తాయని పేర్కొన్నారు. మనుషుల్లోనే కాకుండా..జంతువుల్లో కూడా ఆడ జంతువుల్లో ఇమ్యూనిటీ ఉంటుందని గుర్తించామని. ఆడ ఎలుకలపై పరిశోధనలు చేసినపుడు ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో ఊహించని స్పందనను చూశామన్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో రసాయనాలు ఒక కవచంగా ఏర్పడి వైరస్‌లతో పోరాడుతాయని తెలిపారు.

వాషింగ్టన్‌ వర్సిటీలోని సెంటర్‌ఫర్‌ న్యూరో ఇమ్యునాలజీ, న్యూరో ఇన్‌ఫెక్షన్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ రాబిన్‌ క్లెయిన్‌ కూడా మహిళల్లో రోగనిరోధక శక్తి వైరస్ లను నిర్మూలించడంలో వేగంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. వారి శరీరంలోకి వైరస్ ప్రవేశించినప్పటి నుంచి వారంలోపే అది మరోదశకు వెళ్లకుండా ఇమ్యూనిటీ ఆపివేస్తుందని తెలిపారు. ఆడ పక్షులు, బల్లుల్లో కూడా ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. అలాగే కరోనా నేపథ్యంలో నిర్ణీత దూరం పాటించడంలో పురుషుల కంటే మహిళలు అత్యధికంగా జాగ్రత్తలు పాటించారని తమ అధ్యయనంలో తేలిందని కెంట్‌ వర్సిటీ ఎపిడమాలజిస్టు తార తెలిపారు. అమెరికాలో కూడా స్త్రీ ల కన్నా పురుషుల జీవిత కాలం సుమారు 5 ఏళ్లు తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నేపథ్యంలో.. మహిళల్లో రోగనిరోధశక్తి ఎక్కువగా ఉంటుందని తార అభిప్రాయపడ్డారు.

మొత్తానికి పురుషుల్లో కంటే స్త్రీ లలోనే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉందన్న వాస్తవాన్ని అన్ని దేశాలు అంగీకరించాల్సిన నిజం. ఆమె అబల కాదు సబల అన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఇప్పటి వరకూ అన్నిరంగాల్లోనూ మహిళలదే పై చేయి అనుకున్నాం..ఆరోగ్యం విషయంలోనూ మహిళలే పై చేయి సాధించారు..సాధిస్తున్నారు.

Also Read :ఇదేమి ట్విస్ట్.. రికవరీ అయ్యాక కూడా పాజిటివ్ వస్తోందట..!

Next Story