ఇదేమి ట్విస్ట్.. రికవరీ అయ్యాక కూడా పాజిటివ్ వస్తోందట..!

By అంజి  Published on  7 April 2020 7:11 AM GMT
ఇదేమి ట్విస్ట్.. రికవరీ అయ్యాక కూడా పాజిటివ్ వస్తోందట..!

సియోల్: కోవిద్-19 వైరస్ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నాయి. బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ ఉండడం.. రికవరీ అవుతున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో ప్రభుత్వాలు చాలా టెన్షన్ పడుతూ ఉన్నాయి.

కరోనా మహమ్మారి దెబ్బకు అతలాకుతలం అయిన దక్షిణ కొరియాను ఇప్పుడు మరో సమస్య పట్టి పీడిస్తోంది. కోవిద్-19 బారిన పడి రికవరీ అయిన వాళ్లకు టెస్టులు చేయగా మళ్ళీ పాజిటివ్ అని రావడంతో కొత్త టెన్షన్ మొదలైంది. 51 మంది కరోనా మహమ్మారి బారిన పడి రికవర్ అయ్యారు.. వారికి టెస్టులు చేయగా మళ్లీ కరోనా పాజిటివ్ అని వచ్చింది. కరోనా వైరస్ రీ యాక్టివేషన్ కారణంగా వారికి మళ్లీ పాజిటివ్ అని వచ్చిందని సోమవారం నాడు అక్కడి హెల్త్ అధికారులు వెల్లడించారు. యోన్హాప్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం డేగు, నార్త్ జియాంగ్సాంగ్ ప్రావిన్స్ లోని క్వారెంటైన్ సెంటర్స్ నుండి రికవరీ అయిన వాళ్ళను డిశ్చార్ చేశారు. వారికి తిరిగి పరీక్షలు జరపగా కరోనా వైరస్ సోకిందని తెలుసుకున్నారు. కొరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ జనరల్ జియోంగ్ యూన్కియోంగ్ మాట్లాడుతూ వైరస్ రీ యాక్టివేట్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందని ఆయన అన్నారు. కానీ క్వారంటైన్ నుండి విడుదలైన తక్కువ సమయంలోనే కరోనా వైరస్ పాజిటివ్ రావడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు.

రికవరీ అయ్యాక కూడా మళ్లీ పాజిటివ్ వచ్చిన వారిలో వైరస్ మళ్ళీ రీయాక్టివేట్ అయ్యిందని ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎక్స్పర్ట్ కిమ్ తెలిపారు. సాధారణంగా కోవిద్-19 బారిన పడిన పేషేంట్లకు 24 గంటల్లో రెండు టెస్టులను నిర్వహిస్తారు.. ఆ టెస్టుల్లో నెగటివ్ వస్తే వారిని డిశ్చార్జ్ చేస్తారు. సోమవారం నాడు దక్షిణ కొరియాలో 50 కంటే తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ రికవరీ అయిన వాళ్లకు తిరిగి కరోనా పాజిటివ్ వస్తూ ఉండడం అధికారులను టెన్షన్ పెడుతోంది.

Next Story