Fact Check : ఆమె పద్మనాభ స్వామి గుడి యజమానురాలా.. ట్రావెన్ కోర్ రాజ వంశానికి చెందిన మహిళనా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
కేరళలోని ప్రముఖ దేవాలయం పద్మనాభ స్వామి టెంపుల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన విషయంపై సుప్రీం కోర్టు ఇటీవలే కీలక తీర్పును వెలువరించింది. ఇక నుంచి పద్మనాభ ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికే చెందుతాయని సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసు తొమ్మిదేళ్ల నుంచి అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఆలయ నిర్వహణను సంప్రదాయంగా వస్తున్న మాజీ రాజ కుటుంబం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని 2011లో కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. తొమ్మిదేళ్ల నుంచి సుప్రీంలో విచారణలో ఉన్న ఈ కేసులో ట్రావెన్‌కోర్ రాజ కుటుంబం విజయం సాధించింది.
ఈ తీర్పు వచ్చిన తర్వాత ఓ మహిళ సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెబుతూ వీడియోను పోస్టుచేసింది . అందులో లాయర్లను పొగుడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసింది.
“After 11 years of court battles and winning the case of #Padmanabhaswamytemple, a member of #Travancore Royal family talks on the verdict. A slap on the #Communist government in #Kerala. #Hinduism #Hindus,” అంటూ ఈ వీడియోను పోస్టు చేశారు ఒకరు. ఆమె ట్రావెన్ కోర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన మహిళ అని ఆ పోస్టులో చెప్పారు.
ఆమె పద్మనాభ స్వామి ఆలయానికి ఓనర్ అని మరొకరు పోస్టు పెట్టారు.
ట్రావెన్ కోర్ రాజవంశానికి చెందిన మహిళ వ్యాఖ్యలు ఇవి అని పలువురు పోస్టులు పెట్టారు.
వాట్సప్ లో వైరల్ అవుతున్న ఈ పోస్టుపై నిజానిజాలు తెలియజేయాలని న్యూస్ మీటర్ ను అడిగారు కొందరు.
నిజ నిర్ధారణ:
ఈ వీడియోకు చెందిన స్క్రీన్ షాట్స్ తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఆమె పేరు శిల్ప నాయర్ అని తెలిసింది. 'People for Dharma’ (పీపుల్ ఫర్ ధర్మ) అనే ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడమే కాకుండా, ఆలయాలను కాపాడడానికి ఆమె తన సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు. కేరళ ప్రభుత్వం పద్మనాభ స్వామి ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని అనుకున్నప్పుడు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీపుల్ ఫర్ ధర్మ సంస్థ పోరాడింది.
ఆమె ట్విట్టర్ బయోలో ఆమె బీజీపీ మెంబర్ మాత్రమే కాకుండా, పారిశ్రామిక వేత్త, డ్యాన్సర్ కూడా..! భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. శిల్పా నాయర్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు.
సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఆమె స్వాగతిస్తూ వీడియోను పోస్టు చేశారు. లాయర్లు సాయి దీపక్, సువిదత్ సుందరం కోర్టులో పోరాడారని ఆమె తెలిపారు. చివరికి న్యాయమే గెలిచిందని అన్నారు.
తాను ట్రావెన్ కోర్ రాజవంశానికి చెందిన వ్యక్తిని, ఆమె పద్మనాభ స్వామి ఆలయానికి ఓనర్ అని పెట్టిన పోస్టులు ఆమె దృష్టికి కూడా వచ్చింది. అవన్నీ పచ్చి అబద్ధం అని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేసి.. తాను కేవలం 'పీపుల్ ఫర్ ధర్మ' సంస్థకు మాత్రమే ప్రెసిడెంట్ అని తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టులలో ఉన్న మహిళ పేరు 'శిల్ప నాయర్'. ఆమెకు ట్రావెన్ కోర్ రాజ వంశానికి ఎటువంటి సంబంధం లేదు. ఆమె పద్మనాభస్వామి ఆలయానికి యజమాని అంటూ వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.