నెల్లూరులో దారుణం.. మాస్కు వేసుకోమన్నందుకు ఉద్యోగినిపై దాడి
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2020 12:39 PM ISTరాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కు వేసుకుమని చెప్పడమే ఆ మహిళా ఉద్యోగి తప్పుఅయ్యింది. నన్నే మాస్కు వేసుకోమంటావా అంటూ.. మహిళా అని చూడకుండా పై అధికారి విచక్షారహితంగా దాడి చేశాడు. ఈ దారుణ సంఘటన నెల్లూరులో జరిగింది. రెండు రోజుల క్రితమే ఈ ఘటన జరుగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.
నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ఇనుప రాడ్డుతో దాడి చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మాస్కు వేసుకోమని భాస్కర్‌ను ఆ మహిళా ఉద్యోగిని కోరింది. దీంతో ఆగ్రహించిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్.. ఆ మహిళా ఉద్యోగినిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. తోటి ఉద్యోగులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మహిళా ఉద్యోగిని ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. డిప్యూటీ మేనేజర్ భాస్కర్‌ను అదుపులోకి తీసుకోనేందుకు ప్రయత్నిస్తున్నారు.