ఫాస్టాగ్ లేకుంటే జేబుకు చిల్లు త‌ప్ప‌దు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 May 2020 7:08 PM IST
ఫాస్టాగ్ లేకుంటే జేబుకు చిల్లు త‌ప్ప‌దు

టోల్ ప్లాజాల వ‌ద్ద ర‌ద్దీని నియంత్రించ‌డం కోసం, న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం గ‌త సంవ‌త్స‌రం ఫాస్టాగ్ ను తీసుకువ‌చ్చింది. జాతీయ ర‌హ‌దారిపై వెళ్లే వాహ‌నాల‌కు ఫాస్టాగ్ త‌ప్ప‌నిసరి అని చెప్ప‌డంతో కొంద‌రు వాహన‌దారులు ఫాస్టాగ్‌ను కొనుగోలు చేశారు. ఫాస్టాగ్ లేక‌పోతే.. రెండు రెట్లు ఫైన్ వేస్తామ‌ని కేంద్రం చెబుతూ వ‌స్తోంది. ఇప్ప‌టికే చాలా సార్లు ఈ గ‌డువు వాయిదా వేస్తూ వ‌చ్చింది.

తాజాగా ఇవాళ రోడ్డు ర‌వాణా, హైవేల మంత్రిత్వ‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫాస్టాగ్ లేకున్నా.. లేదా స‌రిగా ప‌నిచేయ‌ని ఫాస్టాగ్ ఉన్నా.. అట్టి వాహ‌నాలు టోల్‌ప్లాజా వ‌ద్ద‌ ఫాస్టాగ్ లేన్‌లోకి ప్ర‌వేశించ‌రాదు. ఒక‌వేళ ఆ వాహ‌నాలు ఫాస్టాగ్ లేన్‌లోకి వ‌స్తే, ఆ వెహికిల్‌ క్యాట‌గిరీ టోల్ ఫీజును రెండు రెట్లు ఎక్కువ‌గా వ‌సూల్ చేయ‌నున్నారు.

ఫాస్టాగ్ ఉన్న వాహానాలు టోల్‌ప్లాజా వ‌ద్ద నిరీక్షించాల్సిన అవ‌స‌రం లేదు. నేరుగా వెళ్లిపోవ‌చ్చు. ఇలాంటి వాహానాల కోసం టోల్‌ప్లాజాల వ‌ద్ద ప్ర‌త్యేక లైన్ల‌ను ఏర్పాటు చేశారు. దేశంలోని 23 బ్యాంకులతో పాటు, నేషనల్ హైవే టోల్ ప్లాజాల వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సేల్స్ మెషిన్లు, ఎంపిక చేసిన ఏజెన్సీలు, బ్యాంకు బ్రాంచీలు ఫాస్టాగ్ లు అందజేస్తున్నాయి. ఫాస్టాగ్ కావాల్సిన వారు ముందుగా రూ.200 రుసం చెల్లించి కేవైసీ ప‌త్ర‌ల‌తో ఫాస్టాగ్‌కు ధ‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఫాస్టాగ్ సిక్క‌ర్‌ను వాహ‌నం ముందు అద్దానికి అతికించుకోవాలి. వాహానం టోల్‌ఫ్లాజా నుంచి వెళ్లే స‌మ‌యంలో ఈ స్టిక్క‌ర్‌ను స్కాన్ చేస్తారు. వెంట‌నే వాలెట్ నుంచి డ‌బ్బులు క‌ట్ అవుతాయి. స్కానింగ్ కోసం టోల్ ఫ్లాజాల వ‌ద్ద వాహానాల‌ను ఆపాల్సిన అవ‌స‌రం లేదు.

Next Story