హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తే.. వైన్స్‌ షాపు యజమానుల కొత్త డిమాండ్‌

By సుభాష్  Published on  1 July 2020 11:18 AM IST
హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తే.. వైన్స్‌ షాపు యజమానుల కొత్త డిమాండ్‌

తెలంగాణలో కరోనా వైరస్‌ రోజురోజుకు అంతకంతకు పెరిగిపోతోంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నాయి. రేపు తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు సీఎం కేసీఆర్‌. అయితే హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ అమలు చేస్తారనే ఉద్దేశంతో వైన్స్‌ షాపుల యజమానులు కొత్తడిమాండ్‌తో ముందుకొస్తున్నారు. నగరంలో మళ్లీ లాక్‌డౌన్‌ అమలు చేస్తే నిత్యవసర సరుకుల దుకాణాలకు అనుమతించేలా మద్యం దుకాణాలకు కూడా అనుమతి ఇవ్వాలని యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ మేరకు లిక్కర్‌ అండ్‌ బీర్‌ సప్లయర్స్‌ అసోసియేషన్‌, వైన్స్‌ షాప్స్‌ యజమానులు ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. నిత్యవసర వస్తువుల దుకాణాలకు రోజూ 3 గంటలు అనుమతి ఇస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మద్యం షాపులకు కూడా రోజూ అంతే సమయం అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

అనుమతి ఇవ్వకపోతే తాము తీవ్రంగా నష్టపోతాం

ఒక వేళ హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించినట్లయితే మద్యం షాపులకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో ఇప్పటికే తమకు అమ్మకాలు పడిపోయాయని, బీర్ల అమ్మకాలు కూడా అనుకున్నంతగా లేవని చెబుతున్నారు. ఇప్పటికే రెండు నెలలుగా ఉన్న లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం లైసెన్స్‌ ఫీజును ఏ మాత్రం తగ్గించలేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోజుకు కనీసం మూడు గంటలైనా ప్రభుత్వం అనుమతి ఇస్తే నిబంధనలు పాటిస్తే అమ్మకాలు కొనసాగిస్తామని చెబుతున్నారు.

Next Story