హైదరాబాద్: మద్యం షాపులో దొంగలు పడ్డారు.. భారీగా మద్యం ఎత్తుకెళ్లారు
By సుభాష్ Published on 4 April 2020 4:23 PM IST
కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో వ్యాపార, వాణిజ్యరంగాలతో పాటు వైన్స్ షాపులు సైతం మూతపడ్డాయి. ఒక వైపు మద్యం లేక మందు ప్రియులు నానా అవస్థలు పడుతున్నా.. ఎట్టి పరిస్థితుల్లో మద్యం షాపులు తీసేది లేదని తేల్చి చెప్పింది తెలంగాణ సర్కార్. ఇక మందు దొరక్క కొందరికి పిచ్చెక్కి ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరుతుంటే మరి కొందరు అదే అదను చూసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి సమీపంలో ఓ వైన్స్ షాపులో చోరీ జరిగింది.
మద్యం షాపు పైభాగంలో ఉండే రేకులను కత్తిరించి షాపులోకి దూరి రూ. సుమారు లక్ష రూపాయలకుపైగా విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. అలాగే షాపులో కొంత నగదును కూడా ఎత్తికెళ్లారు. ఈ చోరీ షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. చోరీ జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
షాపు యజమాని ఏమంటున్నాడు..
షాపులో ఉన్న సీసీ పుటేజీ రికార్డును పరిశీలించామని, తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు చోరీ చేసిన వ్యక్తులు షాపులోనే ఉన్నట్లు తెలుస్తోందని మద్యం షాపు యజమాని చెబుతున్నారు. షాపులో వెనక ఉన్న రూమ్‌లో సీసీ కెమెరాలను ఆఫ్ చేశారని, ముందు రూమ్‌లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయని అన్నారు. ఈ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
కర్ణాటకలో కూడా..
అలాగే కర్ణాటకలో కూడా ఇదే విధంగానే చోరీ జరిగింది. మంగళూరు సమీపంలోని ఉల్లాల్ పట్టణంలో ఓ వైన్స్ షాపులో చొరబడి లక్ష రూపాయలకుపైగా విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. అంతేకాదు డిజిటల్ వీడియో రికార్డర్‌ను కూడా ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.