జమ్మూ కశ్మీర్ కి ఇక హిందూ ముఖ్యమంత్రి?
By రాణి Published on 9 March 2020 5:53 PM IST
ఇన్నాళ్లూ దేశంలో ముస్లిం ముఖ్యమంత్రి ఉండే ఏకైక రాష్ట్రంగా నిలిచిన జమ్మూ కశ్మీర్ లో ఇక హిందువు ముఖ్యమంత్రి కాబోతున్నాడా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన నిమిత్తం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా దేశాయిని అధ్యక్షులుగా నియమించారు. ఏడాది లోగా ఈ కమిటీ తన నివేదికను ఇస్తుంది.
ఈ కమిటీ నియోజకవర్గాలన్నిటిలోనూ దాదాపుగా సమాన జనాభా ఉండేలా చూస్తుంది. ఇప్పటి వరకూ కశ్మీర్ లోయలోని నియోజకవర్గాల్లో వోటర్ల సంఖ్య తక్కువ. జమ్మూ ప్రాంతంలో నియోజకవర్గాల సగటు జనాభా ఎక్కువ. ఉదాహరణకి కశ్మీర్ లోయలోని గురేజ్ నియోజకవర్గంలో మొత్తం వోటర్ల సంఖ్య 25. జమ్మూలోని గాంధీ నగర్ లో దాదాపు రెండు లక్షల మంది ఓటర్లున్నారు. పర్యవసానంగా జమ్మూలో 37 నియోజకవర్గాలే ఉండగా కశ్మీర్ లోయలో 46 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ లడాఖ్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉండేవారు. మొత్తం 87 సీట్లు ఉన్నాయి. ఇవి కాక 24 సీట్లు ఖాళీగా ఉంటాయి. ఇవి పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ల కోసం కేటాయించినవి.
Also Read :
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి డొక్కా మాణిక్య వరప్రసాద్
ఫలితంగా ఇప్పటి వరకూ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కశ్మీర్ లోయకు చెందిన వారే. జమ్మూ నుంచి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. దీనితో ప్రాంతీయ విభేదాలు తలెత్తాయి. ఇప్పుడు జమ్మూ కశ్మీర్ నుంచి లడాఖ్ వేరైపోయింది. పునర్విభజన హేతుబద్ధంగా జరిగితే మరో ఆరు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. ఇవి ఎక్కువగా జమ్మూ ప్రాంతంలోనే ఉంటాయి. ఫలితంగా రెండు ప్రాంతాల మధ్య ఎంతో కొంత సమానత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అయితే కశ్మీర్ లోని స్థానాల్లో వోటర్లు ఒకే మతానికి చెందినవారు కాగా, జమ్మూ లో మాత్రం మిశ్రిత జనాభా ఉంటుంది.
అయితే దాదాపు సమాన స్థానాలు ఉన్న కారణంగా జమ్మూ నుంచి కూడా ముఖ్యమంత్రి ఎన్నికయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. దీంతో పునర్విభజన పట్ల జమ్మూ ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.