భారత్‌పై చైనా మనసులో ఏముంది?చైనాను ఢిల్లీ నమ్మొచ్చా?!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Oct 2019 7:16 PM GMTజమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నటువంటి ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం ఆగస్ట్ 5న రద్దు చేసింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక అసెంబ్లీ ఇచ్చి, లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. అక్టోబర్ 31నుంచి జమ్ముకశ్మీర్ లడఖ్‌ల్లో కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. అక్టోబర్ 31 నుంచి జమ్ము కశ్మీర్, లడఖ్‌లు పూర్తిగా భారత రాజ్యాంగ పరిధిలోకి వస్తాయి. అయితే..జమ్ముకశ్మీర్ పూర్తిగా భారత రాజ్యాంగ పరిధిలోకి వచ్చే నెలలోనే అంటే అక్డోబర్‌లోనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ లో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో జిన్ పింగ్ భారత పర్యటనలో ఉంటారు. పింగ్ పర్యటన సందర్భంగా న్యూస్ మీటర్ ప్రత్యేక విశ్లేషణ.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ మధ్యనే చైనాలో పర్యటించారు. చైనా నాయకత్వం నుంచి ఒక ప్రకటన విడుదలైంది.
ఆ ప్రకటన పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్‌కు రుచించలేదు. ఆ ప్రకటన సారాంశం ఏమంటే..జమ్ముకశ్మీర్ గొడవను భారత్ - పాక్‌లు ద్వైపాక్షిక చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలి. జమ్ము కశ్మీర్ పై చైనా ఎప్పుడు పాడే పాతపాటకు ఇది విరుద్ధం. యూఎన్ చార్టర్, దాని నిబంధనలకు లోబడి జమ్ముకశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని చెబుతుండేది. ఇప్పుడు ద్వైపాక్షిక చర్చలు ద్వారా పరిష్కరించుకోమని చెప్పింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ చైనాలో పర్యటిస్తున్న సమయంలోనే ఆ దేశ విదేశాంగ శాఖ చేసిన ఈ ప్రకటన పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా చేసింది. కశ్మీర్ పై యూఎన్‌లో పాక్ మద్దతుగా ఉన్న చైనా ఎందుకు ఒక్కసారిగా మాట మార్చింది..?! .అంతేకాదు..పంచశీలను కూడా చైనా నేతలు ఎందుకు గుర్తు చేస్తున్నారు.? వారి ఎందుకు వ్యూహం మార్చారు?.
పైకి నవ్వుతూ నొసటితో ఎక్కిరించే రకం చైనా. హిందీ - చీనీ బాయ్ బాయ్ అన్నప్పుడే సరిహద్దులు దాటి వచ్చి వెన్నుపోటు పొడిచింది. జమ్ముకశ్మర్‌లో సియాచిన్‌ను ఆక్రమించుకుని మాది అంటోంది. అరుణాచల్ ప్రదేశ్ మాదేనని ప్రపంచ వేదికల మీద గగ్గోలు పెడుతుంది. అంతేకాదు..అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు పాస్ పోర్ట్ లేకుండా తమ దేశం రావచ్చని చెబుతోంది. పీవోకే నుంచి అరేబియా సముద్రానికి సీపీఈసీను వేస్తుంది. పీవోకేలో అనేక జల, విద్యుత్ ప్రాజెక్ట్‌లు చైనా స్వయంగా నిర్మిస్తుంది.ఇలాంటి చైనాను భారత్ నమ్మొచ్చా?.
ఇండియాకు పింగ్ఎందుకు వస్తున్నారు..?!
భారత్ - పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తలు చోటుచేసుకున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు పింగ్ పర్యటన ఖరారైంది .
సాధారణ టూర్ అని రెండుదేశాల విదేశాంగ శాఖలు ప్రకటించినప్పటికీ..లోలోపల ఏదో జరుగుతుందనేది మాత్రం ఢిల్లీలో వినిపిస్తోంది. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవద్దని, పాక్‌కు అనవసరంగా అండగా ఉండొద్దని..అంతర్జాతీయ సూత్రాలకు చైనా కట్టుబడి ఉండాలని పింగ్‌కు మోదీ చెప్పే అవకాశముంది. ఇక...అమెరికా- చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం గురించి వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశముంది. సరిహద్దు గొడవలు, పాక్‌తో సాన్నిహిత్యం ఎలా ఉన్నప్పటికీ..వాణిజ్య పరంగా ఇబ్బందుల్లేకుండా ముందుకు వెళ్లాలని ఇరు దేశాల నేతలు నిర్ణయానికి రావచ్చు. ఇక..సీపీఈసీ, బలూచిస్థాన్ గురించి కూడా మోదీ ఇంటర్నల్‌గా పింగ్ తో ప్రస్తావించే అవకాశముంది. సీపీఈసీ విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చైనాకు తమ అసంతృప్తిని తెలియజేసింది. మళ్లీ పింగ్ ముందు మోదీ సీపీఈసీ విషయంలో కచ్చితంగా గట్టిగా మాట్లాడే అవకాశముంది.
కశ్మీర్ పై చైనాలో మార్పు ఎందుకు వచ్చింది?
అంతర్జాతీయ సమీకరణలు, రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. భారత్ 1962 నాటి దేశం కాదు. ఆర్థికంగా పుంజుకుంటుంది. భారత్‌కు అంతర్జాతీయంగా పలుకుబడి పెరుగుతుంది. ప్రపంచలోనే అతిపెద్ద మార్కెట్ భారత్. ఇండియాలాంటి పెద్ద మార్కెట్‌ను వదులుకోవడానికి చైనా లాంటి దేశం సాహసించదు. అంతేకాదు..మోదీ రూపంలో భారత్‌కు బలమైన నాయకత్వం దొరికింది. నిర్ణయాలు తీసుకోవడంలోనే కాదు..వాటిని అమలు చేయడంలో కూడా మోదీ దూకుడ్ని ప్రదర్శిస్తున్నారు. రష్యాలాంటి పెద్ద దేశానికి అప్పులిచ్చే స్థాయికి భారత్ ఆర్ధిక వ్యవస్థ చేరుకుంటుంది. భారత విదేశాంగ విధానం ఒకప్పుడు వేరు..ఇప్పుడు వేరు. భారత విదేశాంగ విధానం ఇప్పుడు సూటిగా ,స్పష్టంగా ఉంది. పంటికి పన్ను, కంటికి కన్ను అనే రీతిలో విదేశాంగ విధానం విధానాలు మారాయి. వీటన్నింటినీ కూడా చైనా గమనిస్తోంది. పాక్‌కు ఎంత మద్దతుగా నిలబడాలని డ్రాగన్ మనసులో ఉన్నా అంతర్జాతీయంగా పరిస్థితులు కలిసి రావడంలేదు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఉగ్రవాదం పుట్టినిల్లు పాకిస్థాన్‌ను వెనకేసుకొస్తే చైనాను కూడా ప్రపంచ దేశాలు చీదరించుకునే పరిస్థితి వస్తుంది. ఈ విషయం పింగ్‌కు బాగా తెలుసు. అందుకే...డ్రాగన్ కంట్రీ వ్యూహం మార్చి ఉండవచ్చు.
కుడితిలో పడ్డ ఎలుకలా డ్రాగన్ కంట్రీ
ఇప్పుడు పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వాలేదు..అలా అని భారత్ పక్షాన మాట్లాడలేదు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పే పాక్..పశ్చిమ చైనాలోని ఉయ్‌ఘర్ ముస్లింలపై మాత్రం మాట్లాడదు. ఉయ్‌ఘర్ ముస్లింలను చైనా గొడ్లను బంధించినట్లు బంధించి వేధించినా చైనా మాట్లాడదు. అమెరికా పర్యటనలో పాక్ పీఎం ఇమ్రాన్‌ను ఓ విలేకరి ఇదే ప్రశ్న అడిగితే..సమాధానం చెప్పకుండా నీళ్ల నమిలిన సంగతి తెలిసిందే. ఉయ్‌ఘర్ ముస్లింలపై చైనా అనుసరిస్తున్న వైఖరిని అమెరికా, పాశ్చత్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్‌కు నీతులు చెప్పే స్థితిలో చైనా లేదు. పాక్‌ను వెనకేసుకొస్తే ప్రపంచ దేశాల ముందు తల దించుకోవాల్సి వస్తుందనే..'ద్వైపాక్షికం' అనే పాట పాడుతుంది. అంతేకాని..భారత్ మీద ప్రేమ మాత్రం కాదు.
చైనాను నమ్మొద్దంటోన్న రక్షణ నిపుణులు
పాకిస్తాన్ కంటే ప్రమాదకరమైన దేశం చైనా అంటున్నారు రక్షణ నిపుణులు. పాక్ తోడ జాడిస్తే నిమిషాల్లో కత్తిరించవచ్చు. చైనా డ్రాగన్ మాత్రం అదునుచూసి కాటేస్తదని హెచ్చరిస్తున్నారు డిఫెన్స్ ఎక్స్‌ఫర్ట్స్. మన రక్షణ వ్యవస్థ, ఆయుధాలు, ప్రణాళికలు, వ్యూహాలు అన్ని కూడా చైనాను దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఆక్సాయ్‌చిన్‌ను భారత్‌కు చైనా ఇవ్వగలదా? పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఆర్ధిక నడవను ఆపేయగలదా?. అరుణాచల్ ప్రదేశ్‌పై మాట్లాడకుండా ఉండగలదా?.అని ప్రశ్నిస్తున్నారు రక్షణ నిపుణులు.భవిష్యత్తులో పాక్, చైనాలతో ఒకేసారి యుద్ధం చేయాల్సి వస్తుందనేది రక్షణ నిపుణుల అంచనా .అందుకు తగ్గట్లే భారత్ రెడీగా ఉండాలని వారు సూచిస్తున్నారు. చైనా శత్రు దేశాలను మంచి చేసుకుంటున్న ఇండియా.. ఈ వ్యూహాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని చెబుతున్నారు. భారత్ చుట్టూ జల వలయాన్ని చైనా పన్నుతుందని..దానిని విచ్చిన్నం చేయాలంటే చైనా చుట్టూ 'ఎనిమీ కంట్రీస్ ' వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరముంది.
వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్