ఏంటీ బయో బబుల్.. నిబంధనలు అంత కఠినమా.?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Oct 2020 12:17 PM ISTబయో బబుల్ ఇప్పుడు ఎక్కవగా వినపడుతున్న మాట. ఐపీఎల్‌లో భాగంగా చెన్నై జట్టు ఆటగాడు కేఎం ఆసిఫ్ బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించడంతో అతన్ని జట్టునుండి తప్పించారు. అనంతరం ఆసిఫ్‌ను వెంటనే ఆరు రోజుల స్వీయ నిర్బంధంలోకి పంపారు. అనంతరం అతడికి కొవిడ్ పరీక్ష నిర్వహించగా అందులో నెగెటివ్ రావడంతో అతడు జట్టులో చేరాడు. దీంతో ఇప్పుడంతా ఏంటీ బయో బబుల్ అనే చర్చ జరుగుతోంది.
కొవిడ్-19 మహమ్మారి నుండి పొంచివున్న ప్రమాదాన్ని ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ముప్పును తగ్గించడానికి.. ఆటగాళ్లను బయటి ప్రపంచంతో వేరుచేసి సురక్షితమైన వాతావరణం కల్పించే విధానమే ‘బయో సెక్యూర్ బబుల్’. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా బయో బబుల్ నిబంధనల విషయంలో ఐపీఎల్ జట్లన్నీ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిందే.
బయో బబుల్ నుంచి క్రికెటర్ ఎవరైనా బయటకు వెళ్తే అతడు ఆరు రోజులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సి ఉంటుంది. రెండోసారీ అలాచేస్తే ఆ ఆటగాడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు. మూడోసారీ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇక ఆ క్రికెటర్‌ను టోర్నమెంట్‌నుంచి ఇంటికి పంపించేస్తారు. అతడి స్థానంలో మరో ఆటగాడిని అనుమతించరు.
ఇక.. ప్రతిరోజు ఆరోగ్య వివరాలు పొందుపరచని, జీపీఎస్ ట్రాకర్ ధరించని, షెడ్యూల్ కొవిడ్ పరీక్షకు హాజరుకాని క్రికెటర్లకు రూ. 60 వేల జరిమానా విధిస్తారు. క్రికెటర్లు, సహాయ సిబ్బందితో మాట్లాడేందుకు బయటి వ్యక్తులను అనుమతిస్తే.. నిబంధనలలో తొలి తప్పిదం కింద ఆ జట్టు రూ. కోటి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రెండోసారి తప్పు చేస్తే ఆ ఫ్రాంచైజీ పాయింట్ల నుంచి ఒక పాయింటు, మూడోసారీ ఉల్లంఘిస్తే మూడు పాయింట్లు కోల్పోతుంది.
ఇదిలావుంటే.. ఐపీఎల్ కంటే ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య ఇటీవల సిరీస్ జరిగినప్పుడు ఈ ‘బయో సెక్యూర్ బబుల్’ విధానాన్ని మొదటగా అమలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించి, తన స్నేహితుడిని కలిశాడు. దీంతో అతడిని ఓ టెస్టు మ్యాచ్ నుంచి పక్కనపెట్టారు.