బయో బబుల్‌ బుడగను అత్రికమించిన చెన్నై పేసర్‌..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2020 8:32 AM GMT
బయో బబుల్‌ బుడగను అత్రికమించిన చెన్నై పేసర్‌..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజన్‌లో వరుస ఓటములతో సతమతమౌతోంది చెన్నై సూపర్‌ కింగ్స్. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్‌లో గెలిచిన సీఎస్‌కే.. మిగతా రెండు మ్యాచ్‌ల్లో చేతులెత్తేసింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఆ జట్టు కీలక బ్యాట్స్‌మెన్‌ సురేష్‌ రైనా యూఏఈ నుంచి స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతోనే రైనా వచ్చినట్లు చెబుతున్నా.. జట్టుపై ఉన్న అసంతృప్తితోనే వచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం సద్దుమణగకముందే.. ఆ జట్టు మరో వివాదంలో చిక్కుకుంది. ఆ జట్టు బౌలర్‌ కేఎం ఆసిఫ్ బయోబుడగ నిబంధనలను అతిక్రమించినట్లు తెలిసింది.

బయో సెక్యూర్ బబుల్ నిబంధనలను ఉల్లంఘించిన క్రికెటర్ ఆరురోజుల పాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. అసలే ఓటములతో సతమతమౌతోన్న టీమ్‌.. ఓ బౌలర్‌ను కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉంచాల్సి వస్తుందని, దాని ప్రభావం జట్టులోని మిగిలిన ఆటగాళ్ల మానసిక స్థితిపైనా పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఆ వార్తలను ఆ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ ఖండించారు. ఎలాంటి నిబంధనను ఉల్లంగించలేదని స్పష్టం చేశారు.

చెన్నై శుక్రవారం హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ప్రాక్టీస్‌ అనంతరం హోటల్‌లో వెళ్లిన ఆసిఫ్.. తనకు కేటాయించిన గది తాళం చెవిని పోగొట్టుకున్నట్లు గుర్తించాడు. వెంటనే రిసెప్షన్‌ వద్దకి వెళ్లి డూప్లికేట్‌ కీని తీసుకున్నాడు. కాగా.. ఆ రిసెప్షన్‌ బయో సెక్యూర్‌ బబుల్‌ పరిధిలో లేదంటూ.. అందుకనే అతడిని వారం రోజులు క్వారంటైన్‌కు పంపించారని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా.. ఈ వార్తలను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రాంఛైజీ సీఈఓ కాశీవిశ్వనాథన్‌ మాత్రం కొట్టిపారేశారు. అతను తాళం పొగొట్టుకున్న మాట వాస్తవమేనని చెప్పాడు. అయితే.. అతను బయో సెక్యూర్ బబుల్ నిబంధనలను బ్రేక్ చేయలేదని అన్నారు. జట్టు కోసమే ప్రత్యేకంగా కేటాయించిన సిబ్బంది మాత్రమే అక్కడ ఉన్నారని వివరించారు. వారినే తాళంచెవి కోసం ఆసిప్‌ అడిగాడని తెలిపారు. బయట వ్యక్తులెవరినీ కలవలేదని, రిసెప్షన్‌ వద్దకు వెళ్లలేదని వెల్లడించారు. కాగా.. గతంలో చెన్నై బృందంలోని ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మందికి కొవిడ్‌ సోకడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

Next Story