పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో చెన్నై.. మండిపడుతున్న అభిమానులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sep 2020 6:59 AM GMT
పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో చెన్నై.. మండిపడుతున్న అభిమానులు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో అత్యంత విజయవంతం అయిన జట్టు ఏదైన ఉందంటే.. అది చెన్నై సూపర్‌కింగ్స్‌ మాత్రమే. దాదాపు ప్రతి సీజన్‌లో ఆ జట్టు ప్లే ఆప్‌కు చేరుకుంటుంది. ప్రతి సారి కప్‌ సాధించే జట్లలలో సీఎస్‌కే పేరు కూడా తప్పకుండా వినిపిస్తుంటుంది. అందకు కారణం ధోని కెప్టెన్సీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహీ లాంటి కెప్టెన్‌ తమకు ఉండాలని ప్రతి ఫ్రాంచైజీ కోరుకుంటుందనేది కానదలేని వాస్తవం. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో ఆ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు.

ఆరంభ మ్యాచ్‌లో మినహా.. మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఆటతీరు చాలా పేలవంగా ఉంది. ప్రస్తుతం చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. దీనిని చెన్నై అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా.. తమ టీమ్‌ను, ముఖ్యంగా ధోనిని విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. నిన్నటి వరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో అడుగు స్థానంలో ఉండగా.. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు గెలుపు బోణి కొట్టింది. ఇరు జట్లకు సమానపాయింట్లు ఉన్నప్పటికి.. మెరుగైన రన్‌రేట్‌ కారణంగా హైదరాబాద్‌ ఆరో స్థానంలో నిలవగా.. చెన్నైకి ఆఖరి స్థానానికి పడిపోయింది.

ప్రస్తుతం చెన్నై టీమ్ వైఫల్యంపై పలు మీమ్స్ నెటింట్లో వైరల్‌గా మారాయి. 2020 కరోనాను తెచ్చినట్టే, చెన్నై జట్టుకు ఘోర వైఫల్యాన్ని కూడా మోసుకుని వచ్చిందని సెటైర్లు వేస్తున్నారు. ముంబైతో మ్యాచ్‌లో గెలిచిన ధోని సేన.. ఢిల్లీ కాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లలో ధోనీ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు రావడంపైనా విమర్శలు చెలరేగాయి. అయితే, మ్యాచ్ పరిస్థితిని బట్టి తన ఆలోచన మారుతుందని.. తమ టీమ్‌లో పలువురికి కరోనా సోకడంతో క్వారంటైన్ లో అధిక సమయం ఉండాల్సి రావడంతో సరైన ప్రాక్టీస్ లేకపోయిందని, మ్యాచ్ లు ఇంకా ఎన్నో ఆడాల్సి వున్నందున తదుపరి గేమ్ లలో సత్తా చాటుతామని ధోనీ సమర్ధించుకున్నా, విమర్శలు మాత్రం ఆగడం లేదు.

Next Story