జడ్పీటీసీ స్థానానికి నామినేషన్‌ వేసిన వెయిట్‌ లిఫ్టర్‌

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి జడ్పీటీసీ స్థానానికి అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ పూజారి శైలజ నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ పార్టీ తరుపున ఆమె బుధవారం నామినేషన్‌ను దాఖలు చేశారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని వంజంగి గ్రామంలో జన్మించారు పూజారి శైలజ. డిగ్రీ పూర్తిచేసి తరువాత 7 సంవత్సరాల పాటు వెయిట్‌ లిప్టింగ్‌లో శిక్షణ పొందారు. కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మూడు బంగారు పతకాలను సాధించారు. మహిళల 75 కిలోల విభాగంలో జాతీయ రికార్డులను బద్దలుగొట్టి స్వర్ణం కైవసం చేసుకున్నారు. స్నాచ్ లో 102.5 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ లో 132.5 కిలోలతో మొత్తం 235 కిలోలు బరువెత్తి తన పేరును చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.

1998లో హైదరాబాద్‌లో జరిగిన ఇండిపెండెంట్ గోల్డ్ కప్ లో తొలి బంగారు పతకాన్ని సాధించారు. అదే యేడాది కోల్‌కతాలో జరిగిన జూనియర్ నేషనల్స్ లో కాంస్య పతకాన్ని సాధించారు. అదే యేడాది బెంగళూరులోజరిగిన సీనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ లో ప్రథమ స్థానంలో నిలిచారు. 1999లో కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన సదరన్ స్టేట్ గేమ్స్ లో పసిడి పతకాన్ని సాధించారు. అదే యేడాది మణిపూర్ లో జరిగిన జాతీయ క్రీడల్లో నాల్గవ స్థానంలో నిలిచారు. మైసూరులో జరిగిన దక్షిణ భారత క్రీడా పోటీల్లో స్వర్ణపతకాన్ని సాధిచారు. విశాఖపట్నంలో జరిగిన 16వ మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లోలో రజత పతకం పొందారు. 2000 లో కేరళలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణపతకం పొందారు. 2002లో కామన్వెల్తు క్రీడల్లో మూడు పసిడి పతకాలు సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచారు.

వెయిట్ లిఫ్టింగ్‌లో ఎన్నో మైలురాళ్లను సాధించిన శైలజ.. రాజకీయాల్లో ఎలా రాణిస్తారో వేచి చూడాల్సిందే..

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *