ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు

By Newsmeter.Network  Published on  11 March 2020 7:10 AM GMT
ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు

ముఖ్యాంశాలు

  • నెల్లూరు యువకుడికి కరోనా నిర్దారణ
  • వారంరోజుల క్రితమే ఇటలీ నుంచి వచ్చిన యువకుడు
  • యువకుడు ఉండే చిన్నబజార్లో హై అలర్ట్

ఏపీలో తొలి కరానో పాజిటివ్‌ కేసు నమోదైంది. నెల్లూరు పట్టణంలో నివాసముండే యువకుడికి కరానో వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్దారించినట్లు సమాచారం. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ యువకుడు ఉండే చిన్న బజార్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఆ యువకుడు వారంరోజుల క్రితం ఇటీలి నుంచి నెల్లూరులోని చిన్నబజార్‌లోని తననివాసానికి వచ్చాడు. అతడికి జలుబు, దగ్గుతో పాటుజ్వరం వచ్చింది. అతడికి వైరస్‌ లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అతడి శాంపిల్స్‌ సేకరించి పూణె పంపించారు. రిపోర్టులుసైతం వచ్చినట్లు తెలుస్తోంది. రిపోర్టులో ఆ యువకుడికి కరానో వైరస్‌ సోకినట్లు నిర్దారణ అయినట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. చిన్నబజార్‌, సంతపేట ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా జాగ్రత్తలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు ఆదేశాలతో ప్రతిష్టాత్మక రంగనాథుని రథోత్సవాన్ని అధికారులు నిలిపివేశారు. దీంతో భక్తులు వెనుదిరిగారు. అయితే తూర్పు వీధి వరకైనా రథాన్ని తిప్పే అవకాశం ఇవ్వాలని హిందూ సంఘాలు కోరాయి. ఆలయంలో చర్చలు నిర్వహించిన అధికారులు.. జనాలంతా ఒకే దగ్గర గుమ్మికూడడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఎట్టిపరిస్థితుల్లోనూ రథోత్సవానికి అనుమతించేది లేదని చెప్పినట్లు సమాచారం.

ప్రతి ఏడాది సంతపేట నాలుగు కాళ్ల మందపం వరకు రథోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ సారి మాత్రం కరోనా దెబ్బకు వాయిదా వేశారు. ఇదిలాఉంటే నెల్లూరు నగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఈ వార్త తెలుసుకున్న నెల్లూరు వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇటలీ నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎవరెవరితో కలిసి తిరిగాడు అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. వారికి దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా 62కి చేరిన పాజిటివ్‌ కేసులు..

దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి ప్రబలుతుంది. రోజురోజుకు ఈ వైరస్‌ సోరికన వారి సంఖ్య పెరుగుతుంది. మహారాష్ట్రంలోని పూణెలో మొత్తం ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్దారణ అయిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ ప్రకటించారు. వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే అంశంపైనా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో 85 ఏళ్ల వృద్ధుడికి కరోనా నిర్దారణ అయింది. దీంతో దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 62కి చేరింది. కేరళ, కర్ణాటకతో పాటు కరోనా వైరస్‌ కేసులు నమోదైన రాష్ట్రాలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Next Story
Share it