తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By Srikanth Gundamalla Published on 29 Sep 2023 1:12 AM GMTతెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని సూచిచింది. అక్టోబర్ 3 వరకు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు,మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లోనూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెఇపారు. ఇక ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు నమోదవుతాయని.. కనిష్టంగా 22 డిగ్రీలు ఉండే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కాగా.. ఇప్పటికే నిర్మల్, కామారెడ్డి, భద్రద్రి కొత్తగూడెం, సిద్దిపేట తదితర జిల్లాల్లో వర్షం భారీగానే పడింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా తడ్వాల్‌లో 11.8 సెంమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. తెలంగాణలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతమే నమోదు అయ్యింది. మరోసారి వర్ష సూచన ఉండటంతో రైతులు కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంది.
మరోవైపు హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌లో గణపతి నిమజ్జనాలు జరుగుతుంటే వర్షం కురిసింది. దాంతో.. భక్తులు కాస్త ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి ఒక్కసారి నీరు చేరడంతో గందరగోళంగా మారింది. ఇక అధికారులు తగు చర్యలు తీసుకున్న కారణంగా గణనాథులు సాఫీగా ముందుకు సాగాయి. అయితే.. సికింద్రాబాద్‌లో నాలాలో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన మృతురాలి కుటుంబంలో విషాదాన్ని నింపింది.