ప్రస్తుత అల్పపీడనం, సోమవారం ఏర్పడే అల్పపీడనాల ప్రభావంతో రానున్న 3రోజులపాటు కోస్తాలో చెదురుమదురుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదని సూచించారు. ఇవాళ అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అటు తెలంగాణ రాష్ట్రంలో నేడు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్ధిపేట, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. జగిత్యాల , కామారెడ్డి, మెదక్, నల్లొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.