తెలంగాణ రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. సాధారణం కన్నా రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు ఆరేడు డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయని తెలిపింది.
ఇక నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందనట్లు తెలిపింది. ఇది సాధారణం కంటే ఐదు డిగ్రీలు అధికమని చెప్పింది. కాగా.. గత పది సంవత్సరాలలో మార్చి నెలలో నమోదైన అత్యధిక పగటి ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. ఇంతకముందు 2016లో మార్చి 23న 42 డిగ్రీలుగా నమోదైంది.
ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి గాలులు విస్తున్నందున ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ఈ వేడికి గాలిలోకి తేమ అసాధారణ స్థాయిలో తగ్గి పొడి వాతావరణం ఏర్పడి ఉక్కపోతలు అధికమైనట్లు వివరించింది. బుధవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాచలం, మెదక్ తదితర ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.