అమరావతి: రానున్న మూడు రోజులు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, రేపు కాకినాడలో మోస్తారు వర్షాలు, సోమవారం అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు చెట్లు క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. నిన్న 12 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయని అలాగే 23 ప్రాంతాల్లో 50మిమీ పైగా వర్షపాతం నమోదైందని వెల్లడించారు. మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 39.9°C అధిక ఉష్ణోగ్రత నమోదైందన్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.