హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న వేళ.. వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్లలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
అటు ఏపీలోని ఆదివారం అల్లూరి జిల్లా కూనవరం, కాకినాడ జిల్లా జగ్గంపేట, కిర్లంపూడి, ఏలేశ్వరం మండలాల్లో తీవ్రవడగాలులు,17 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీఎస్‌డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నిన్న వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో42.5°C, నంద్యాల జిల్లా గోస్పాడులో42.2°C, 95 ప్రాంతాల్లో40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు తెలిపారు. అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.