తెలంగాణ రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. ఎండల కారణంగా బయటకు వెళ్లాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో మరో నాలుగు రోజులు పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు(శుక్రవారం) నుంచి వచ్చే నెల మూడో తేదీ(సోమవారం) వరకు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
సాధారణం కంటే మరో రెండు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వెల్లడించింది. మంచిర్యాల, నారాయణపేట, ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, వనపర్తి, జోగులాంబ-గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇదిలా ఉంటే.. నిన్న(గురువారం) కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఆరుబయట పని చేసే వారు, ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.