Telangana: రాబోయే రెండ్రోజులు వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో గడిచిన మూడ్రోజులుగా అక్కడక్కడ వడగళ్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on  19 March 2024 10:31 AM GMT
telangana, rain, weather report, yellow alert ,


Telangana: రాబోయే రెండ్రోజులు వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ 

తెలంగాణలో గడిచిన మూడ్రోజులుగా అక్కడక్కడ వడగళ్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల ఈదురుగాలులతో వర్షాలు పడితే.. మిగతా ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకుని ఉంటున్నాయి. ఎండలతో ప్రజలు సతమతం అవుతున్న నేపథ్యంలో కాస్త ఉపశమనం లభించినట్లు అయ్యింది. అయితే.. కొన్ని చోట్ల వడగళ్ల వానలు కురవడం ద్వారా రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. మామిడి, జామ, మక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి రైతులను అలర్ట్ చేసింది. రాబోయే రెండ్రోజుల పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ క్రమంలో పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెండ్రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని కూడా చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల నిర్మల్ జిల్లాతో పాటు నిజామాబాద్‌ జిల్లాలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

Next Story