ఇవాళ తెలంగాణలో అతిభారీ వర్షాలు.. హైదరాబాద్‌కు అలర్ట్
తెలంగాణలో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
By Srikanth Gundamalla Published on 15 July 2024 10:45 AM ISTఇవాళ తెలంగాణలో అతిభారీ వర్షాలు.. హైదరాబాద్‌కు అలర్ట్
తెలంగాణలో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి వాన కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది.
కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కాబట్టి ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి, జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతం అయ్యి ఉంది. సాయంత్రం వరకు భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడనున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిబ్బంది సమాయత్తం అయ్యారు.
ఆదివారం నమోదైన వర్షపాతం
ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా నీల్వాయిలో అత్యధికంగా 15.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. భూపాలపల్లి జిల్లా కాటారంలో 11.15 సెం.మీ వర్షపాతం, ఆదిలాబాద్‌లోని కుంచవెల్లిలో 11.08 సెం.మీ వర్షపాతం, భూపాలపల్లిలోని మహదేవ్‌పూర్‌లో 11 సెమీ వర్షపాతం నమోదు అయ్యింది. ఇక కొయ్యూరులో 10.65, మంచిర్యాలలోని కోటపల్లిలో 9.48 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో 9.48 సెం.మీ, వికారాబాద్‌లోని నవాబ్‌పేటలో 8.48, హైదరాబాద్‌లోని షేక్‌పేటలో 8.45 సెం.మీ, మారేడ్‌పల్లిలో 8.4, ఖైరతాబాద్‌లో 8.4, ముషీరాబాద్‌లో 8.2, శేరిలింగంపల్లిలో 7.93 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.