తెలంగాణలో రానున్న మూడ్రోజులు వర్షాలు.. సీఎం రేవంత్ పలు సూచనలు

వానాకాలం ప్రారంభం అయ్యింది. ముఖ్యంగా సూర్యుడి తాపం నుంచి ఉపశమనం లభించింది.

By Srikanth Gundamalla
Published on : 10 Jun 2024 4:44 PM IST

telangana, rain alert, weather, cm revanth reddy ,

తెలంగాణలో రానున్న మూడ్రోజులు వర్షాలు.. సీఎం రేవంత్ పలు సూచనలు

వానాకాలం ప్రారంభం అయ్యింది. ముఖ్యంగా సూర్యుడి తాపం నుంచి ఉపశమనం లభించింది. ఇక వర్షాలు కూడా గత వారం నుంచి పలు చోట్ల పడుతూ ఉన్నాయి. తాజాగా వర్షాలపై హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం గుడ్‌ న్యూస్ చెప్పింది. తెలంగాణలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తారించాయనీ.. ఇక ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరిస్తున్నట్లు వాతావరణ కేంద్రం చెప్పింది. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజ‌య‌న‌గ‌రం, ఇస్లాంపూర్ వ‌ర‌కు రుతుప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నట్లు అధికారులు చెప్పారు.

నైరుతి రుతుపవనాలు విస్తరించనున్న క్రమంలో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వివరించింది. ముఖ్యంగా తెలంగాణలోని నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

ఇక వాతావరణ శాఖ ఒక వైపు అలర్ట్ చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా వర్షాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌కు వెళ్లిన ఆయన.. పోలీసులు, ఇతర శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. విద్యుత్, పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.


Next Story