తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  8 Sept 2024 6:48 AM IST
తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడిన విషయం తెలిసిందే. భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. దాంతో.. చాలా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడిప్పుడే వరదల నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాతావరణశాఖ మరోసారి వర్షాలపై అలర్ట్ జారీ చేసింది. తెలంగాణతో పాటు ఏపీలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తన ప్రభావం కూడా కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 19 జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాఖాఖాతం మీద విస్తరించిన ఉందని ఐఎండీ పేర్కొంది. సముద్రమట్టానికి సగటున 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల అవర్తనం విస్తరించి ఉందని వివరించింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి.. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో.. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదివారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక సెప్టెంబర్ 9 నుంచి 3 రోజుల పాటు మళ్లీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

సెప్టెంబర్ 9వ తేదీన ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు వాతావరణశాఖ అధికారులు. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. సెప్టెంబర్ 10వ తేదీన కూడా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Next Story