ఏపీని తాకనున్న రుతుపవనాలు.. ఎప్పుడంటే?

Southwest Monsoon will hit Andhra Pradesh. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయి.

By Medi Samrat
Published on : 10 Jun 2023 9:15 AM IST

ఏపీని తాకనున్న రుతుపవనాలు.. ఎప్పుడంటే?

నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దేశంలోని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. రెండు మూడు రోజుల్లో అనంతపురం మీదుగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలను ఇవి తాకుతాయని పేర్కొంది.గత 24 గంటల్లో వాటి గమనంలో వేగం పెరగడంతో అనుకున్న సమయానికంటే ముందుగానే అవి రాయలసీమను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కేరళ నుంచి రుతుపవనాలు ఆంధ్రా ప్రాంతానికి రావడానికి సాధారణంగా 4 రోజులు పడుతుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్‌ తుపాను ప్రభావంతో రుతుపవనాలు బంగాళాఖాతంలో శ్రీలంక కింది భాగం నుంచి విస్తరిస్తున్నాయి. 3 రోజుల్లోనే అవి పైభాగానికి వచ్చి శుక్రవారం తమిళనాడు, కర్ణాటక వరకు విస్తరించాయి.

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడడంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు గరిష్ఠంగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


Next Story